ఇద్దరూ సీనియర్ నేతలే. వీరిద్దరూ అధికార పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ ఇద్దరు సీనియర్ నేతలు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ.. ఆయన కోర్ టీంలో సభ్యులుగా ఉండి.. తర్వాతి కాలంలో ఆయన ఆగ్రహానికి గురైన నేతలే. ఇద్దరికి సంబంధించి మరో అంశం ఏమంటే.. ఈ ఇద్దరు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వారే కావటం గమనార్హం. అనంతరం ఈ ఇద్దరు నేతలు సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురైన.. పదవులు పోగొట్టుకొని.. గతాన్ని గుర్తుకు తెచ్చుకొని గొప్పగా ఫీలయ్యే వారు.
అలాంటి ఈ ఇద్దరు నేతలు తాజాగా ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న విమర్శలు.. ఆరోపణలు.. తిట్లు తీవ్ర ఉద్రిక్తతకు తెర తీయటమే కాదు.. అధికార పార్టీలో కొత్త ముసలానికి తెర తీసినట్లైంది. ఒకరిపై ఒకరు నేరుగా.. సూటిగా.. ఘాటైన విమర్శలు చేసుకున్నారు. తాజా వివాదం ఎక్కడ షురూ అయ్యిందంటే.. సోమవారం జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్న పెండ్యాలలో ఒక ప్రోగ్రాంకు హాజరయ్యారు రాజయ్య.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో 361 మంది అమాయకుల్ని ఎన్ కౌంటర్ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కడియంకు తప్పని పరిస్థితిగా మారి.. రాజయ్య మీద అంతే తీవ్రంగా మండపడ్డారు. రాజయ్య ఆరోపణల్ని ఖండించిన కడియం.. అతని కంటే ముందు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ.. రాజయ్య తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. ప్రస్తుతం ప్రజల మద్దతు లేని ఆయన మతిస్థిమితం లేకుండా మాట్లాడుతుున్నారన్నారు.
‘ఆయన చిల్లర.. చిలిపి.. తాగుడు చేష్టలతో పాటు అవినీతి.. కమిషన్లకు సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వాటిని బయటపెడితే రాజ్యయ్య ఒక్కరోజు కూడా బయట తిరగలేరు’ అని వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ బర్తరఫ్ అయిన తొలి డిప్యూటీ సీఎం దేశంలోనే ఆయన మొదటివారుగా అభివర్ణించారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటూ ఇంతకాలం విమర్శలు చేస్తున్నా భరిస్తూ ఉన్నానని.. ఇకపై మాత్రం ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. రాజయ్యకు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇదేనని పేర్కొన్నారు.
తనపై చేసిన వ్యాఖ్యల్ని ఇద్దరు మంత్రులతో పాటు.. హనుమకొండ.. జనగామ జిల్లాల పార్టీ అధ్యక్షులతోనూ మాట్లాడినట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్ వద్దకు ఈ ఉదంతాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. మంత్రి కేటీఆర్ కు మరోసారి కరోనా పాజిటివ్ కావటం.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. పార్టీ ఇజ్జత్ ను రోడ్డున పడేసేలా ఉన్న ఈ ఇద్దరు వ్యాఖ్యల విషయంలో గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.