2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసినందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని వైసీపీ పేర్కొంది. అయితే తాజాగా ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి స్పందించారు.
వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన మండిపడ్డారు. కదిరి నియోజకవర్గంలో 10 ఏళ్లగా ఒక్కో ఇటుక పేర్చుతూ పార్టీని బలోపేతం చేశానని.. తానెప్పుడూ వైసీపీకి ద్రోహం చేయలేదని.. పార్టీనే తనకు ద్రోహం చేసిందని సిద్ధారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. వివరణ తీసుకోకుండా తనను సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని ఆయన ఆన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉండగానే ఇన్ఛార్జిని తీసుకొచ్చి నన్ను అవమానించారని.. అధికారులకు నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వొద్దని కట్టడి చేశారని సిద్ధారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక తన పయనం ఏ పార్టీతో అన్నది ఆప్తులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ఈ సందర్భంగా సిద్ధారెడ్డి తెలిపారు. కాగా, గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం మన మాజీ సీఎం జగన్ ఆయనకు సీటు కేటాయించలేదు. సిద్ధారెడ్డి ని పక్కన పెట్టి.. ఆయన బదులుగా మైనార్టీ నేత మక్బూల్ అహ్మద్ చేత పోటీ చేయించారు. అయితే మక్బూల్ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ చేతిలో 6 వేలు పైచిలుకు ఓట్ల తేడా ఓటమి పాలయ్యారు.