మాటలు చెప్పే విషయంలో కేఏ పాల్ కు మించినోళ్లు ఉండరనే చెప్పాలి. ఒకవైపు తెలంగాణలో సీరియస్ పాలిటిక్స్ నడిపిస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తూనే.. అదే సమయంలో ఏపీలోనూ అదరగొట్టేసే ఆయన తీరు మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది. తన ప్రజాశాంతి పార్టీలో లక్షలాది మంది ఉన్నట్లు చెప్పినా.. ఒక్క సరైన నేతను తన పక్కన పెట్టుకోకుండా తిరిగే ఏకైక అధినేతగా కేఏ పాల్ ను చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అంశాల్ని టేకప్ చేసే ఆయన తాజాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తన తండ్రి బర్న్ బాస్ ను కలిసేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా నర్సీపట్నంలోని ఆర్డీవో ఆఫీసు వద్ద స్థానికులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా అస్సలు తగ్గని పాల్.. ఎప్పటిలానే చాలానే విషయాల్ని చెప్పుకొచ్చారు. అందులో విశాఖ ఉక్కు మొదలుకొని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వరకు ఆయన చాలానే అంశాల మీద మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారం కొనుగోలుకు రూ.42 వేల కోట్లకు బిడ్ వేస్తానని చెప్పిన ఆయన.. రెండు వారాల్లో రూ.4వేల కోట్ల మొత్తాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు.
విశాఖ ఉక్కు కర్మాగారం విలువ రూ.3.5 లక్షల కోట్లుగా చెప్పారు. ‘దీన్ని రూ.3500 కోట్లకు అమ్మేద్దామని చూస్తున్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. దీన్ని అందరం కలిసి కాపాడుకోవాలి. అందుకే టీడీపీ.. వైసీపీ.. సీపీఐ నాయకుల్ని కలిసేందుకు విశాఖకు వచ్చా. తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేస్తానంటోంది. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా కేసీఆర్ మాటలు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన కేఏ పాల్.. ‘చంద్రబాబు రూ.5 లక్షల కోట్లు అప్పు చేశారు. అప్పుల రాష్ట్రాన్ని జగన్ చేతికి ఇస్తే.. ఆయన మరో రూ.4 లక్షల కోట్లు అప్పు చేశారు. నేను ముఖ్యమంత్రిని అయితే అమరావతిలో ఆపేసిన బిల్డింగ్ లను ఏడాదిలో పూర్తి చేస్తాను’ అని వ్యాఖ్యానించారు. తనతోపని చేసేందుకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు సిద్ధంగా ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి.. కేఏ పాల్ మాటల్లో నిజం ఎంత? వాస్తవ రూపం దాల్చేవెన్ని? అన్నదిప్పుడు ప్రశ్నగా మారాయి.