రాజమండ్రిలో వైసీపీకి చెందిన కాపు నేతలంతా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టిడిపి హయాంలో కాపులను అణచివేసే కార్యక్రమాలు చేపట్టారని చంద్రబాబు నాయకత్వంలో అనేక కాపు వ్యతిరేక చర్యలు చేపట్టారని మంత్రి అంబటి రాంబాబు తదితరులు ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని చూపించి చంద్రబాబును కాపు వ్యతిరేకిగా ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. ఇక, వైయస్సార్, సీఎం జగన్ కాపులకు పెద్ద పీట వేసి గౌరవంగా చూశారని కితాబిచ్చారు.
అయితే, పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగానే ఈ కాపు నేతలంతా సమావేశం ఏర్పాటు చేశారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసిపి కాపు నేతల భేటీపై టిడిపి సీనియర్ నేత, టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ విమర్శలు గుప్పించారు. రాజమండ్రిలో వైసిపి కాపు మంత్రుల సమావేశం వల్ల కాపు సామాజిక వర్గానికి ఎటువంటి ఉపయోగం లేదని జ్యోతుల నెహ్రూ విమర్శించారు. అసలు, కాపు సామాజిక వర్గాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ భేటీ నిర్వహించారని జ్యోతుల నెహ్రూ ఫైర్ అయ్యారు.
కాపులను రెచ్చగొట్టేలాగా కాపు మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చుపెట్టేలాగా వైసిపి నేతలు కుట్రలు పన్నుతున్నారని జ్యోతుల నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి రంగా హత్య కేసు ప్రధాన నిందితులు వైసిపిలో ఉన్నారనే విషయాన్ని కాపు నేతలు మర్చిపోకూడదని హితవు పలికారు. చంద్రబాబును కాపుల శత్రువుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాపుల రిజర్వేషన్ కోసం చంద్రబాబు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇక, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిస్తే వైసిపికి రాజకీయ భవిష్యత్తు లేదని జ్యోతుల నెహ్రూ చెప్పారు.