మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జడ్జిగా పనిచేసి రిటైర్డ్ అయిన జస్టిస్ కనగరాజ్ పేను ఆంధ్రా ప్రజలకు సుపరిచితమే. ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదన్న కారణంతో రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ తెచ్చి…నిమ్మగడ్డ స్థానంలో జస్టిస్ కనగరాజ్ ను నియమించింది జగన్ సర్కార్. అయితే, సుప్రీం కోర్టు తీర్పుతో నిమ్మగడ్డ తనకు రాజ్యాంగం హక్కుగా ఇచ్చిన పదవిని చేపట్టడంతో జస్టిస్ కనగరాజ్ కు భంగపాటు తప్పలేదు.
కట్ చేస్తే…జస్టిస్ కనగరాజ్ ను ఏపీ పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ కొద్ది రోజుల క్రితం జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, జగన్ సర్కార్ గత అనుభవాల నుంచి పాఠాలు నేర్వలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో మాదిరిగానే ఈసారి కూడా నిబంధనలు అతిక్రమించి మరీ ఏపీ ప్రభుత్వం జస్టిస్ కనగరాజ్ ను నియమించిందన్న ప్రచారం జరుగుతోంది. జగన్ అనుభవరాహిత్యం వల్ల జస్టిస్ కనగరాజ్ కు మరోసారి భంగపాటు తప్పదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పోలీసు కంప్లయింట్ అథారిటీ రూల్స్- 2020లోని సెక్షన్ 4(ఏ) ప్రకారం రిటైర్డ్ హైకోర్టు జడ్జిని పీఏసీ చైర్మన్‌గా నియమించాలి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ,ఆ పదవిలో ఉండబోయే వారి వయసు నిబంధన దగ్గరే చిక్కు వచ్చి పడింది. పీఏసీ చైర్మన్…65 ఏళ్ల వయసు వచ్చేవరకు.. లేదంటే మూడేళ్లు.. ఏది ముందైతే అప్పటి వరకు ఆ పదవిలో ఉండొచ్చు. ఇక, పదవి చేపట్టేనాటికి 65 ఏళ్లు నిండిన వారు ఈ పోస్టుకు అనర్హులని రూల్స్ చెబుతున్నాయి.
కానీ, జస్టిస్ కనగరాజ్ వయస్సు దాదాపు 75 ఏళ్లు. కాబట్టి రూల్స్ ప్రకారం అయుతే ఆయన ఆ పోస్టుకు అనర్హులు. పీసీఏ చైౖర్మన్‌గా జస్టిస్ కనగరాజ్ మూడేళ్లు కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే, ఈ పదవి నుంచి దిగిపోయే నాటికి ఆయన వయస్సు దాదాపు 78 సంవత్సరాలు.దీంతో, జస్టిస్ కనగరాజ్ నియామకంపై నీలినీడలు కమ్ముకున్నాయని విమర్శలు వస్తున్నాయి.
అయితే, గతంలో నిమ్మగడ్డను పదవి నుంచి దించడానికి రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ తెచ్చిన జగన్….అదే తరహాలో జస్టిస్ కనగరాజ్ నియామకం కోసం వయసు నిబంధనకు మార్పులుచేర్పులు చేసి మరో ఆర్డినెన్స్ తేవడం పెద్ద విషయమేమీ కాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏమో…గుర్రం ఎగురా వచ్చు…జగన్ కు నచ్చిన ఆర్డినెన్స్ లు రానూ వచ్చు…తనపై ఉన్న క్రిమినల్ కేసులను జగన్ స్వయంగా కొట్టేసుకోనూ వచ్చు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.జస్టిస్ కనగరాజ్ ను మరోసారి జగన్ షాక్ తప్పదేమోనని విమర్శలు వస్తున్నాయి.