గత ఏడాది ఏపీలో కొత్త ఎస్ఈసీ నియామకం వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమక అనకూలంగా లేని కారణంగా నాటి ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ను తొలగించాలన్న ఉద్దేశంతో జగన్ సర్కార్ రాత్రికి రాత్రే కొత్త ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చి నిమ్మగడ్డను తొలగించింది. ఆ క్రమంలోనే ఎస్ఈసీగా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగ రాజును జగన్ ప్రభుత్వం నియమించింది. అయితే, ఈ నియామకంపై నిమ్మగడ్డ సుప్రీం కోర్టు తలుపు తట్టడంతో నాటకీయ పరిణామాల మధ్య తన పదవిని జస్టిస్ కనగరాజ్ కోల్పోయారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా జస్టిస్ కనగరాజ్ ను మరో కొత్త పోస్టులో నియమించాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ‘పోలీస్ కంప్లైంట్ అథారిటీ’ (పీసీఏ)ను ఏర్పాటు చేసి…దాని చైర్మన్ గా జస్టిస్ కనగరాజ్ ను నియమించాలని జగన్ సర్కార్ భావిస్తోందట. గతంలో ఎస్ఈసీ పదవి విషయంలో భంగపాటుకు గురైన జగన్ … జస్టిస్ కనగరాజ్‌కు సముచిత స్థానం కల్పించాలని ఫిక్స్ అయ్యారట.
అదీగాక, రాష్ట్రంలో పోలీసులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు ‘పోలీస్ కంప్లైట్ అథారిటీ’ని ఏర్పాటు గతంలో సుప్రీం కోర్టు సూచించింది. తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అథారిటీలను ఏర్పాటు చేశారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చైర్మన్‌గా పీసీఏను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో, జస్టిస్ కనగరాజ్ ను ఏపీ పీసీఏ చైర్మన్ గా నియమించి గౌరవించాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందట. పోలీసుల నుంచి ప్రజలకు న్యాయం జరగక పోయినా, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకున్నా, సకాలంలో తగిన న్యాయం లభించక పోయినా ప్రజలు పీసీఏను ఆశ్రయించవచ్చు.