టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు నెల రోజులుగా రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు..రేపు..ఎల్లుండి అంటూ చంద్రబాబు బెయిల్ పిటిషన్లు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 9వ తేదీ చంద్రబాబుకు ఎంతో కీలకంగా మారింది. చంద్రబాబు కేసుల విషయంలో రేపు ‘జడ్జిమెంట్ డే’ అని చెప్పవచ్చు. సుప్రీంకోర్టులో ‘క్వాష్ పిటిషన్’ పై, ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్, రిమాండ్ పిటిషన్ పై, హైకోర్టులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ విషయంపై విచారణ, తీర్పులు ఏ విధంగా ఉండోతున్నాయో రేపు తేలనుంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అంగళ్లు ఘటనకు సంబంధించి చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేష్ రెడ్డి రేపు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఈ వ్యాజ్యాలపై వాదనలు ముగిసి తీర్పు రిజర్వ్ లో ఉంది. టీడీపీ అధినేతను మరోసారి పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా రేపు ఉత్తర్వులు జారీ కానున్నాయి. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై శుక్ర వారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగియడంతో తీర్పు సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో, రేపు తీర్పులపై టీడీపీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.