ఏపీలో వరదల బాధితులకు టాలీవుడ్ ప్రముఖులు భారీగా విరాళాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. వరద బీభత్సంతో విజయవాడ అతలాకుతలమైన నేపథ్యంలో పలువురు స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు ను టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వరద బాధితుల సహాయార్థం రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరూ చెరో రూ. 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ఆ విరాళాల చెక్ లను చంద్రబాబుకు వీరు స్వయంగా అందిస్తారని ప్రచారం జరిగింది.
అయితే, ఆ వార్తల్లో నిజం లేదని తాజాగా రామ్ చరణ్ పీఆర్ టీమ్ ప్రకటించింది. చరణ్ తన వ్యక్తిగత పర్యటనలో ఉన్నారని, చంద్రబాబును ఆయన కలవడం లేదని క్లారిటీనిచ్చింది. ఇక, జూనియర్ ఎన్టీఆర్ కూడా ‘దేవర’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారని, చంద్రబాబును ఈ రోజు తారక్ కలవడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు ప్రకటించాయి.
మరోవైపు, ఏపీ సీఎం చంద్రబాబును టాలీవుడ్ ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, యంగ్ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్సేన్ కలిశారు. వరద బాధితుల కోసం బాలయ్య రూ.50 లక్షలు, సిద్ధు రూ.15 లక్షలు, విష్వక్ రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఆ చెక్ లు చంద్రబాబుకు బాలయ్య, సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్సేన్ స్వయంగా అందించారు.