టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం గురించి గత పదేళ్లుగా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని….తాజాగా ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. మరికొందరైతే, 2023 ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నారని కూడా పుకార్లు పుట్టించారు. టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే తారక్ రావాలని, టీడీపీ పగ్గాలు కూడా తారక్ కు ఇవ్వాలని సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టులు వస్తుంటాయి.
అవన్నీ పుకార్లేనన్న సంగతి తెలిసిన తారక్ మాత్రం తన మానాన తాను వరుస సినిమా షూటింగులు, ప్రోగ్రామ్ లతో బిజీబిజీగా ఉన్నారు.రాజకీయాల్లోకి రావడానికి ఇది సమయం…. సందర్భం కాదని తారక్ కొద్ది నెలల క్రితం కూడా మీడియా ముఖంగా ప్రకటన చేశారు. అయితే, అసలు రాజకీయాల్లోకి మళ్లీ రానని తారక్ చెప్పకపోవడంతో ఏదో ఒక రోజు తారక్ రాజకీయాల్లోకి వస్తారని ఫ్యాన్స్ కొందరు బలంగా ఫిక్స్ అయ్యారు. అవ్వడమే కాదు తాజాగా కొందరు ఎన్టీఆర్ అభిమానులు మరో అడుగు ముందుకు వేసి కుప్పంలో కట్టిన బ్యానర్లు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.
తారక్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన ఫ్యాన్స్ ఓ సరికొత్త జెండా తయారు చేసి ఆవిష్కరించారు. ఏకంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఆవిష్కరించిన ఈ జెండా ఇపుడు చర్చనీయాంశమైంది. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఆవిష్కరించిన హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే ఏపీకి కాబోయే సీఎం ఎన్టీఆర్ (AP Next CM NTR) అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరి, ఈ వ్యవహారంపై తారక్ స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.