2009 ఎన్నికల్లో టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా ప్రచార బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ తన భుజస్కంధాలపై వేసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయాధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు మార్గదర్శకుడిగా ఎన్టీఆర్ చేసిన ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని….తాజాగా ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తారని ఊహాగానాలు వినిపించాయి.
అంతేకాదు, 2023 ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నారని కూడా పుకార్లు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే తారక్ రావాలని, టీడీపీ పగ్గాలు కూడా తారక్ కు ఇవ్వాలని సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టులు వస్తుంటాయి. అవన్నీ పుకార్లేనన్న సంగతి తెలిసిన తారక్ మాత్రం తన మానాన తాను వరుస సినిమా షూటింగులు, ప్రోగ్రామ్ లతో బిజీబిజీగా ఉన్నారు.
రాజకీయాల గురించి తారక్ ఈ మధ్యకాలంలో మాట్లాడిన సందర్భమూ లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా తారక్ రాజకీయలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జెమినీ టీవీలో త్వరలో ప్రసారం కాబోతోన్న ”ఎవరు మీలో కోటీశ్వరులు” కార్యక్రమానికి తారక్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఆ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రెస్ మీట్ లో ”మళ్ళీ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు” అన్న ప్రశ్న ఎదురైంది. రాజకీయాల్లోకి రావడానికి ఇది సమయం…. సందర్భం కాదని తారక్ ఆ ప్రశ్నను తోసిపుచ్చారు.
ఎన్నిసార్లు చెప్పినా అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉన్నారని మీడియా మిత్రులతో సరదాగా తారక్ వ్యాఖ్యానించి ఆ ప్రశ్నను దాటవేశారు. అంతేకాదు, ఈ టాపిక్ పై మళ్లీ కాఫీ తాగుతూ…సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుందాం అని ఆ ప్రశ్న అడిగిన విలేఖరికి సమాధానమిచ్చారు తారక్. అయితే, ఈ సందర్భంగా అసలు రాజకీయాల్లోకి పునరాగమనం చేయనని తారక్ చెప్పకపోవడంతో ఏదో ఒక రోజు తమ అభిమాన నటుడు రాజకీయాల్లోకి వస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.