వైసీపీ ప్రభుత్వం శుభకార్యం అంటూ ప్రారంభించిన కార్యక్రమంలోనూ మంత్రి జోగి రమేష్ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా జనసేనపై ఆయన విరుచుకుపడ్డారు. వాస్తవానికి శుభకార్యంలో ఉన్నప్పుడు.. అందునా ఇంటి నిర్మాణాలు.. గృహ ప్రవేశాలు వంటివి చేస్తున్నప్పుడు.. శత్రువునైనా సాదరంగా ఆహ్వానిస్తాం. ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేలా చూసుకుంటాం. ఎందుకంటే ఇది సంప్రదాయం.
కానీ.. ఏపీ మంత్రి జోగి రమేష్ మాత్రం ఈ సంప్రదాయాలను పక్కన పెట్టేశారు. కార్యక్రమం ఏదైనా కూడా.. జనసేనపై విమర్శలు చేయాల్సిందే అన్నట్టుగా వ్యవహరించారు. తాజాగా రాజధాని అమరావతి ప్రాంతం లో ఆర్-5 జోన్‌ను ఏర్పాటు చేసి అక్కడ ఇతర జిల్లాల పేదలకు ఇళ్లను కేటాయించారు.కొన్నాళ్ల కిందట ఇక్కడ పట్టాలు ఇచ్చారు. తాజాగా ఇక్కడ లబ్ధి దారులకు ఇళ్లు కట్టుకునేలా శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.
ఇక, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న జోగి రమేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సమస్యలు లేదా.. లబ్ధిదారుల సమస్యలు.. వాటిని అధిగమించేందుకు మార్గాలు వంటివాటి ని చర్చించి ఉంటే బాగుండేది. కానీ, ఆయన ఏకపక్షంగా మైకు అందుకోగానే.. జనసేనపై విమర్శలు గుప్పించారు. “ పవన్ కల్యాణ్ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడు. పెళ్లాలను మార్చినట్టు పవన్ పార్టీలను మార్చాడు“ అని సంబంధం లేకుండా మాట్లాడారు.
ఇక, స్వామి భక్తి కూడా అదేసమయంలో చూపించారు. “సీఎం జగన్ అందరికీ అన్నం పెడుతున్నారు. కుల, మతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నారు. చంద్రబాబు గాలికొదిలేస్తే లోకేశ్ ఇష్టమొచ్చినట్టు తిరుగుతున్నాడు. సీఎం జగన్‌తో పోటీపడే స్థాయి లోకేశ్‌కు లేదు“ అని జోగి వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలతో సభకు వచ్చిన మహిళలు ఒకింత ఇబ్బంది పడ్డారు. సందర్భం లేకుండా.. సమయం లేకుండా.. ఈ విమర్శలేంటి? శుభకార్యంలోనూ ప్రతిపక్షాలను వదిలి పెట్టరా? అని నివ్వెర పోయారు.