ఎవరి కోసం ఎవరు బలి అవుతున్నారు? ఎవరు ఆదేశిస్తున్నారు.. ఎవరు పాటిస్తున్నారు.. ఎవరు సస్పెన్ష న్లకు గురవుతూ.. హైకోర్టుల నుంచి చీవాట్లు తింటున్నారు?-ఇదీ ఇప్పుడు ఘనత వహించిన జగనన్న పాలనపై వస్తున్న ప్రశ్నలు. ఒకటి కాదు.. రెండు కాదు.. అడుగడుగునా.. ఏదో ఒక మరక.. పోలీసులకు అంటుకుంటూనే ఉంది. పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత.. నుంచి పోలీసులను ఇంతగా వాడుకున్న ప్రభుత్వం ఏదీ లేదని.. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేననేలా.. తాజాగా ఆరుగురు పోలీసుల సస్పెన్షన్.. ఉదంతం.. కళ్లకు కట్టింది.
ఇక్కడ సస్సెండ్ చేయాల్సింది.. పోలీసులనేనా? లేదా పోలీసులు వ్యవహరించిన తీరు వెనుక దాగున్న షాడో నేతలనా? అనే ప్రశ్నకు జవాబు చెప్పేవారు కరువయ్యారు. నాడు.. తూర్పుగోదావరిలో ఎస్సీ యువకుడి శిరోముండనం, విశాఖలో డాక్టర్ సుధాకర్‌ను నడిరోడ్డుపై చేతులు వెనక్కి విరిచి కట్టి తీసుకువెళ్లిన ఘటన నుంచి రాజధాని గ్రామాల్లో అనవసర దబాయింపులు, ఘీంకరింపుల వరకు పోలీసుల వెనుక ఉన్న ఖాకీలేని పోలీసు నేతపై సర్వత్రా విమర్శలు వస్తూనే ఉన్నాయి. నిజానికి పోలీసు మాన్యువల్ చదివితే.. కానిస్టేబుళ్లు సర్వస్వతంత్రులు కానేకారు. పై అధికారులు చెబితేనే.. వారు చేస్తారు. మరి ఆ పై అధికారులు.. నేతల కనుసన్నల్లో ఓలలాడుతున్న ఫలితంగానే వ్యవస్థతో చీవాట్లు తింటున్నారు.
తాజాగా రాజధాని రైతుల చేతులకు బేడీలు వేసి నరసరావు పేట జైలు నుంచి గుంటూరు జైలుకు తరలించారు. నిజానికి పేట నుంచి గుంటూరుకు మధ్య దూరం ఎంత ఎక్కువగా వేసుకున్నా.. 40 కిలో మీటర్ల లోపే! అంటే.. గట్టిగా ఓ గంట ప్రయాణం. ఇంత మాత్రానికే వారికి బేడీలు వేయాలా? వారేమన్నా గూండాలా? రౌడీలా..? లేక ఆమాత్రం పోలీసులు వారిని కట్టడి చేయలేని దౌర్బల్య స్థితిలోకి దిగజారి పోయారా? ఎందుకు బేడీలు వేయాల్సి వచ్చింది? ఇదంతా వ్యూహం ప్రకారం జరిగిన వ్యవహారం. కేసు నుంచి వారిని జైలు తరలించేవరకు ఈ వ్యవహారం మొత్తంలో షాడో నేత ఒకరు ఉన్నారనేది స్థానికంగా వినిపిస్తున్న వ్యాఖ్యలు.
కానీ, ఇప్పుడు బలి అయింది.. ఎవరు? పరువు పోగొట్టుకున్నది ఎవరు? అంటే.. అక్షరాలా పోలీసులే! రైతలుకు బేడీల ఘటన చిలికి చిలికి గాలివానగా మారుతున్న నేపథ్యంలో మరోసారి అటు కేంద్రంలోని హక్కులసంఘంతోను, ఇటు హైకోర్టుతోనూ శుభ్రంగా తలంటిచుకోవాల్సి వస్తుందని భీతిల్లిన ఉన్నతాధికారి.. ఉపశమన చర్యల పేరుతో కింది స్థాయికానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి.. చేతులు దులుపు కొన్నారు.
కానీ, వాస్తవానికి చర్యలు తీసుకోవాల్సి వస్తే.. ఎవరిని బోనులోకి ఎక్కించాలి? అనేదే.. ఇప్పుడు తెరమీదికి వస్తున్న ప్రధాన ప్రశ్న. ఏదేమైనా.. తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికి అనే సూత్రంలో ఇప్పుడు కానిస్టేబుళ్లు బాధితులు కావొచ్చు.. కానీ.. వ్యవస్థీకృత నేరంగా మారిపోతున్న అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించగలిగితేనే.. ఇలాంటి దురాగతాలకు ముకుతాడు పడుతుంది!!