కొత్తగా సీఎం పదవి చేపట్టిన యువకుడు వ్యవస్థలోని లోపాలపై ఫోకస్ చేయడం….గాడి తప్పిన వ్యవస్థను, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న జనాలను దారిలో పెట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడం….వంటి సన్నివేశాలను ఎన్నో తెలుగు సినిమాల్లో చూసుంటాం. జనాలు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించేందుకుగాను భారీ ఫైన్లు వేయడం….ఆ ఫైన్లు బాదుడికి జనాలంతా రాముడు మంచి బాలుడిలా ట్రాఫిక్ రూల్స్ పాటించడం వంటి సీన్లు ఈ మధ్య కాలంలో వచ్చిన ‘భరత్ అనే నేను’ అనే సినిమాలోనూ చాలామంది చూసే ఉంటారు. ఇదే తరహాలో తాజాగా ఏపీలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానా వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీ సీఎం ‘జగన్ అనే నేను’….ఫైన్లు పెంచుతున్నాను అంటూ భారీగా జరిమానాలు వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు.
ట్రాఫిక్ చలాన్ల జరిమానాలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన జీవో కూడా జారీ అయింది. సెల్‌ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10000, రేసింగ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.5 వేలు, రెండోసారికి రూ.10 వేల జరిమానా విధించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ.2వేలు, రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు జరిమానా విధించనున్నారు. పర్మిట్ లేని వాహనాలు నడిపితే రూ.10 వేలు, ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు, వాహన బరువు చెకింగ్ కోసం ఆపకపోతే రూ.40 వేలు ఫైన్ కట్టాల్సిందే. రేసింగ్‌కు పాల్పడితే మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు ఫైన్ కట్టక తప్పదు. ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10 వేలు జరిమానా విధిస్తారు. అనవసరంగా హారన్ మోగిస్తే మొదటిసారి రూ. వెయ్యి, రెండోసారి రూ.2 వేలు జరిమానా కట్టించుకుంటారు. వేగంగా వాహనం నడిపితే రూ. 1000 ఫైన్ కట్టాల్సిందే. బైక్ నుంచి 7 సీటర్ వాహనాల వరకు ఒకే విధమైన జరిమానా ఉంటుందని అధికారులు తెలిపారు. సినీ ఫక్కీలో పెంచిన ఈ ఫైన్లపై ప్రజల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.