సీఎం జగన్, వైసీపీ నేతలపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సందర్భానుసారంగా విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం మొదలుబెట్టిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం విఫలమైందని, జనంలోకి వెళ్లాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని జేసీ ప్రభాకర్ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 26 నుంచి బీసీ మంత్రులు చేపట్టనున్న బస్సు యాత్రపై కూడా జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ బస్సులపై రాళ్లు పడే అవకాశాలున్నట్లు తనకు అనుమానాలున్నాయని, పోలీసుల బందోబస్తుతో యాత్ర చేయాలని జేసీ అన్నారు. బస్సులకు సేఫ్ గార్డ్లు పెట్టుకుంటే మంచిదని, పోలీసులు వాహనాల తరహాలో ఫెన్సింగ్ పెట్టుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం విఫలం కావడంతోనే గడపగడప అంటోందని, గడపగడపకు వెళ్తే రాళ్లతో కొట్టే రోజులు త్వరలో వస్తాయని చురకలంటించారు. జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, అడుగడుగాన అక్రమాలు, ఆక్రమణలే ఉన్నాయని విమర్శించారు.
వైసీపీ పాలనలో గుడికి వెళ్లేందుకు కూడా అనుమతి తీసుకోవాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. రాయదుర్గంలోని ఆలయానికి తమ పార్టీ నేత కాల్వ శ్రీనివాసులు ఎందుకు అనుమతించడం లేదని నిలదీశఆరు. రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతుందనడానికి ఇదే నిదర్శమని విమర్శించారు. పోలీసులను అడ్డు పెట్టుకుని వైసీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయదుర్గంలో స్వామి వారి కళ్యాణంలో తప్పు చేశారని, ఆ తప్పు ఒప్పుకోకుండా సవాళ్లు చేస్తూ పోలీసులతో అడ్డుకుంటారా అని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుతో కలిసి వెంకటరమణస్వామి ఆలయానికి వస్తానని చెప్పారు.