ఒకే రాష్ట్రం ఒకే రాజధాని పేరుతో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పాదయాత్రను భగ్నం చేయాలని జగన్, వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పాదయాత్ర ఉత్తరాంధ్రపై దండయాత్ర అంటూ మాటలతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అవకాశం దొరికిన చోటల్లా పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులతో విఫల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలా, మహా పాదయాత్ర చేస్తున్న రైతుల మనో:ధైర్యం దెబ్బతినేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే ఏపీకి రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే జగన్, వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహా పాదయాత్ర చేస్తున్న రైతులను కలిసిన జేసీ…జగన్ ను ఏకిపారేశారు. రైతులను మానసికంగా భయపెట్టడానికి జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నంత ఊపు ఈ సమావేశాలలో వైసీపీ నేతలకు లేదని జేసీ చెప్పుకొచ్చారు. అమరావతి రైతులు అధైర్య పడవద్దని, రాజధాని అమరావతిలోనే ఉంటుందని జేసీ ధైర్యాన్నిచ్చారు.
ఏపీకి అమరావతి రాజధాని అని హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలలకు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం ఏంటని జేసీ ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రకు వెళ్లొద్దని రైతులకు వైసీపీ నేతలు చెప్పడం, వారి యాత్రను అడ్డుకుంటామని బెదిరించడం సరికాదన్నారు. అన్ని ప్రాంతాలకు అమరావతి సమాన దూరంలో ఉంటుందని చెప్పారు. అమరావతి రైతులకు మద్దతుగా తాను రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చానని చెప్పారు. తాను పాదయాత్రలో పాల్గొనేందుకు వస్తుంటే రాయలసీమవాసులు అడ్డుకోలేదని, తమ ప్రాంతంలోనూ రైతుల పాదయాత్ర జరగాలని వారు కోరుకుంటున్నారని అన్నారు.