టీడీపీ సీనియర్ నాయకుడు, అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. మీడియా ముందే ఆయన భోరున విలపించారు. అయితే.. ఇదేదో.. ఆయనకు కష్టం వచ్చి కాదు. టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారాలోకేష్ మండుటెండను కూడా లెక్క చేయకుండా చేస్తున్న పాదయాత్రను చూసి.. తట్టుకోలేక ఇలా జేసీ కన్నీటి పర్యంతమయ్యారు.
లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర 70వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి నారా లోకేష్ పాదయాత్రపై మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. శ్రీమంతుడైన నారా లోకేష్ తన కాళ్లకు బొబ్బలు వచ్చినా కూడా వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా మండుటెండలో తిరుగుతున్నది ఎవరి కోసమో తెలుసా.. అంటూ ప్రభాకర్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో మీడియా మిత్రులే ఆయనను ఓదార్చారు.
అనంతరం ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. లోకేష్ గొప్ప నాయకుడవుతాడని అన్నారు. ”యువగళం పాదయాత్ర చేపట్టిన నారా లోకేష్.. నీ అరికాళ్లకు బొబ్బలు వచ్చిన కూడా అలాగే పాదయాత్ర చేస్తున్నావు. నువ్వు చాలా గ్రేట్.. భవిష్యత్తులో మంచి లీడర్ అవుతావు. శ్రీమంతుడైన నారా లోకేష్ అతని కాళ్లకు వచ్చిన బొబ్బలు కూడా లెక్క చేయకుండా మండుటెండలో తిరుగుతున్న ది ఎవరో కోసమో తెలుసా.. ఈ రాష్ట్ర ప్రజల కోసమే. అతని తాత, నాన్న, తల్లి, భార్య, పిల్లలందరూ శ్రీమంతులు“ అని జేసీ చెప్పుకొచ్చారు.
నారా, నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారంతా ఈ రాష్ట్రం బాగుండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని నిరంతరం తపన పడుతుంటారని జేసీ చెప్పారు. లోకేష్ కర్మ జీవి అని పేర్కొన్నారు. సున్నితంగా పెరిగిన లోకేష్ ఈరోజు ఇలా పాదయాత్ర చేస్తున్నారంటే అందుకు ఆయన తల్లికి, భార్యకు చేతులెత్తి దండం పెడుతున్నానన్నారు. లోకేష్ పర్యటించిన ప్రాంతాల్లో కార్యకర్తల్లో, ప్రజల్లో పెను మార్పులు చూస్తున్నామని ఆయన కన్నీళ్లు కార్చారు.
లోకేష్ పాదయాత్రపై జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగం. "ప్రజల కోసం లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. లోకేష్ కాళ్లకు బొబ్బలు చూశాను" అంటూ కంటతడి #YuvaGalamPadayatra #YuvaGalam #NaraLokesh #NaraLokeshForPeople pic.twitter.com/IxnwsiRtXm
— YuvaGalam (@yuvagalam) April 14, 2023