అవును మిత్రపక్షానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టి షాకే ఇచ్చారు. స్ధానికసంస్దల ఎన్నికలు మొదలైన దగ్గర నుండి బీజేపీకి షాకుల మీద షాకులు తుగులుతునే ఉన్నాయి. అయినా జనసేన తీరు విషయంలో బీజేపీ ఏమీ చేయలేకపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఇపుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల అనధికారికంగా మరికొన్ని చోట్ల అధికారికంగా తెలుగుదేశంపార్టీ+జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఇలాంటి విచిత్రాలు సాధారణంగా జరుగుతుంటాయి.
నర్సాపురం, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటిల్లో తెలుగుదేశంపార్టీ+జనసేనలు పొత్తులు కుదుర్చుకుని పోటీ చేస్తున్నాయి. ఏలూరు కార్పొరేషన్లో టీడీపీ అభ్యర్ధులు లేని డివిజన్లలో తెలుగుదేశంపార్టీ మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ డైరెక్టుగానే జనసేన అభ్యర్ధుల కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని చింతమనేని బాహాటంగా చెప్పి మరీ ప్రచారం చేస్తున్నారు. దాంతో ఇటు టీడీపీ సీనియర్ నేతలు అటు బీజేపీ నేతలు ఏమి చేయాలో తోచక దిక్కులు చూస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వల్లే జనసేన తన దారి తాను చూసుకుంటున్నదా అనే అనుమానం పెరిగిపోతోంది.
నరసాపురంలో 31 వార్డులున్నాయి. వీటిల్లో మూడు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వాటిల్లో 19 చోట్ల టీడీపీ, ఏడు వార్డుల్లో జనసేలు పోటీ చేస్తున్నాయి. టీడీపీ పోటీ చేసే వార్డుల్లో జనసేన పోటీకి నిలపలేదు. అలాగే జనసేన బలంగా ఉందని అనుకున్న వార్డుల్లో టీడీపీ పోటీకి నిలపలేదు. ఇక్కడ టీడీపీ మాజీ ఎంఎల్ఏ బండారు మాధవనాయుడు, నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బొమ్మిడి నాయకర్ ఇద్దరు కలిసే అభ్యర్ధుల విజయం కోసం ప్రచారం చేస్తున్నారు.
ఇక జంగారెడ్డిగూడెంలో కూడా రెండుపార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయి. ఇక్కడ జనసేన ఏడు వార్డుల్లో పోటీ చేస్తోంది. పొత్తుల్లో భాగంగా ఈ ఐదువార్డుల్లో టీడీపీ తన అభ్యర్ధుల నామినేషన్లను ఉపసంహరించుకుంది. మొత్తం మీద బీజేపీ చోద్యం చూస్తుండగా ఎంచక్కా టీడీపీ, జనసేనలు పొత్తులు పెట్టేసుకుని పోటీ చేస్తున్నాయి. ఈ విషయాలన్నీ బహిరంగంగానే జరుగుతున్నా బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఏమీ మాట్లాడలేకపోతున్నారు.