వైసిపి నేతలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్ననని వైసిపి నేతలు విమర్శిస్తున్నారని, కానీ, తాను విడాకులు ఇచ్చి భరణం చెల్లించిన తర్వాతే మరో పెళ్లి చేసుకున్నానని పవన్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది.
విడాకులు, భరణం ఇచ్చి ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు అన్న రీతిలో పవన్ చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచాయని ఆ నోటీసులలో మహిళా కమిషన్ పేర్కొంది ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ మహిళా కమిషన్ తీరుపై జనసేన పార్టీ స్పందించింది. ఏపీ మహిళా కమిషన్ పై ప్రశ్నల జల్లు కురిపించింది. వైసీపీ నేతలు, మంత్రులు నోటితో చెప్పలేని అసభ్య పదజాలంతో మహిళలను కించపరిచినప్పుడు ఈ మహిళా కమిషన్ ఎక్కడుందని జనసేన ప్రశ్నిస్తోంది.
అత్యాచారాలు జరగడానికి తల్లి పెంపకంలో లోపమే కారణమని రాష్ట్ర హోం మంత్రి అన్న వ్యాఖ్యలను జనసేన గుర్తు చేసింది. ఆ వ్యాఖ్యలు మహిళా లోకాన్ని, మాతృమూర్తులను అవమానించడం కాదా అని ప్రశ్నించింది. ఇక, రాష్ట్రంలో గర్భిణీలు, బాలికలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని జనసేన నిలదీసింది. ఒకటో రెండో అత్యాచారాలు జరుగుతుంటాయని మహిళా మంత్రి చేసిన కామెంట్లపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని నిలదీసింది.
సుగాలి ప్రీతి విషయంలో, పొద్దుటూరులో దళిత యువతిపై అత్యాచారం ఘటనలో మహిళా కమిషన్ ఏ చర్యలు తీసుకుందని ప్రశ్నించింది. ఇలా రాష్ట్రంలో మహిళలపై, యువతులపై, విద్యార్థినులపై, బాలికలపై జరిగిన పలు అత్యాచారాలను ప్రస్తావిస్తూ ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మపై జనసేన పార్టీ సందించిన ప్రశ్నలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరి, ఈ ప్రశ్నలకు వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్ ఏ విధంగా సమాధానం ఇస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.