ఏపీలో బ్రో సినిమా రచ్చ ముదిరి పాకాన పడుతోంది. పవన్ పై సినిమా తీయబోతున్నానంటూ అయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కొన్ని టైటిల్స్ ను మంత్రి అంబటి మీడియా సమావేశంలో ప్రకటించడం సంచలనం రేపింది. బ్రో సినిమాను నిర్మించింది బ్లాక్ మనీతో అని, దానిపై ఢిల్లీ వెళ్లి మరీ ఈడీ, సీీబీఐ అధికారులకు ఫిర్యాదు చేస్తానని అంబటి ప్రకటించారు. దీంతో, అంబటికి తాజాగా జనసేన నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. జగన్, అంబటిలపై వెబ్ సిరీస్ తీయబోతున్నామని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ప్రకటించారు.
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన వైసీపీ నేతలు సినిమాలపై పడ్డారని, పవన్ ఫొటో చూసినా, పేరు విన్నా వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు తమ శాఖలను వదిలేసి పవన్ గురించే మాట్లాడుతున్నారని, మంత్రి పదవులకు రాజీనామా చేసి రివ్యూలు రాసుకోవాలని చురకలంటించారు. జగన్ పై సినిమా తీసేంత బడ్జెట్ లేదని, అందుకే వెబ్ సిరీస్ ప్లాన్ చేశామని అన్నారు. అంతేకాదు, ఆ వెబ్ సిరీస్ కు డాటర్ ఆఫ్ వివేకా, డ్రైవర్ డోర్ డెలివరీ, అరగంట అదే ఇల్లు, ఒక ఖైదీ వదిలిన బాణం, కోడికత్తి సమేత శ్రీను, గంజాయి మిస్ అయిన అమ్మాయి మధ్యలో ఇసుక దిబ్బలు, తల్లి చెల్లి ఖైదీ నెంబర్ 6093 టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని ప్రకటించారు.
ఇక, ఈ వెబ్ సిరీస్ లో నటించే ఆసక్తి ఉంటే వైసీపీలోని నటులు కూడా ట్రై చేసుకోవచ్చని, తెల్ల జుట్టు ఉన్న వాళ్లకూ అవకాశం ఇస్తామని అంబటికి కౌంటర్ ఇచ్చారు. పవన్ పై అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. ఇక, తిరుపతిలో అంబటికి జనసేన నేతలు షాకిచ్చారు. అంబటి రాంబాబుపై ‘SSS’ పేరుతో సినిమా ముహూర్తపు షాట్ కూడా చిత్రీకరించారు. ఒక వ్యక్తికి అంబటి రాంబాబు మాస్క్ వేసి ఓ సీన్ తీయడం సంచలనం రేపుతోంది. ‘SSS’ అంటే ‘సందులో సంబరాల శ్యాంబాబు’ అని సెటైర్లు వేశారు. ప్రాజెక్టుల గురించి కాకుండా పవన్ గురించి మాట్లాడితే రాబోయే రోజుల్లో ‘XXX రాంబాబు’ సినిమా కూడా తీస్తామని వార్నింగ్ ఇచ్చారు.