అసెంబ్లీలో నిబంధనల ప్రకారం మొత్తం సభ్యుల సంఖ్యలో 10 శాతం మంది సభ్యులు ఉన్న పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. వైసీపీకి 11 మంది సభ్యులే ఉండడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కి ఉంటే ప్రజా పద్ధుల కమిటీ (పీఏసీ) చైర్మన్ గా ఆ పార్టీ సభ్యుడిని నియమించేవారు. ఈ క్రమంలోనే పీఏసీ ఛైర్మన్ పదవి కోసం వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కానీ, వైసీపీకి చుక్కెదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైసీపీకి సంఖ్యాబలం లేని కారణంగా ఆ పదవి పెద్దిరెడ్డికి ఇవ్వకూడదని కూటమి సర్కార్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులును పీఏసీ ఛైర్మన్ గా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆ పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పీఏసీలో మొత్తం 12 మంది సభ్యులు ఉండగా..అందులో 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు. ఆ 12 మంది సభ్యులకు కూటమి ప్రభుత్వమే నామినేషన్ దాఖలు చేసింది.
పీఏసీ చైర్మన్గా 2014 – 2019 మధ్య బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, 2019 – 2024 మధ్య పయ్యావుల కేశవ్ బాధ్యతలను నిర్వర్తించారు. ఆయా సందర్భాల్లో ఆ పార్టీలకు ప్రతిపక్ష హోదా ఉండడంతో సంప్రదాయం ప్రకారం పీఏసీ చైర్మన్ పదవిని ఆ పార్టీలకే ఇచ్చారు. కానీ, వైసీపీకి మాత్రం ఆ హోదా దక్కలేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా, పీఏసీ చైర్మన్ రెండూ వైసీపీకి దక్కకపోవడంతో ఆ పార్టీకి మరోసారి భంగపాటు తప్పలేదు.