టాలీవుడ్ స్టార్ కమెడియన్, జనసేన నేత పృథ్వీ రాజ్ కొద్ది రోజుల క్రితం వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి బయటికి వచ్చిన తర్వాత సందర్భానుసారంగా జగన్ పై, వైసీపీ నేతలపై పృథ్వీ సంచలన విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక, ఇటీవల బ్రో చిత్రంలో మంత్రి అంబటి రాంబాబునుద్దేశించి క్రియేట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్యాంబాబు పాత్రలో కూడా ఆయన నటించారు. కావాలనే అంబటి రాంబాబుపై సెటైరికల్ గా ఆ పాత్ర క్రియేట్ చేశారని, ఉద్దేశపూర్వకంగానే పృథ్వి అందులో నటించారని ఆరోపణలు వస్తున్నాయి.
అయితే, తాను కేవలం దర్శకుడు చెప్పింది మాత్రమే చేశానని పృధ్వీ రాజ్ గతంలో వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి జగన్ ప్రభుత్వంపై, శ్యాంబాబు పాత్రపై పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో జగన్ పాలన అధ్వాన్నంగా ఉందని పృథ్వీరాజ్ సంచలన విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికలలో జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక, పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్రపై ఆయన మరోసారి స్పందించారు. తన దర్శకుడు చెప్పింది తాను చేశానని, వేరే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయలేదని క్లారిటీనిచ్చారు. ‘కొత్త రంగుల ప్రపంచం సినిమా’ను స్వయంగా తెరకెక్కిస్తున్నానని, అందులో హీరోయిన్ గా తన కుమార్తె శ్రీను పరిచయం చేస్తున్నానని చెప్పారు. ఈ చిత్రంలో హీరో తన మిత్రుడి కుమారుడు క్రాంతి అని పృథ్వీ వెల్లడించారు. ఖమ్మం జిల్లాలోని బోనకల్లులో ఈ చిత్ర యూనిట్ సందడి చేసిన సందర్భంగా పృథ్వీరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.