మాజీ మంత్రి.. వైసీపీ సీనియర్ నేత పేర్ని నానికి గుడివాడలో ఊహించని షాక్ తగిలింది. ఆదివారం గుడివాడకు వచ్చిన పేర్నినాని తమ పార్టీకి చెందిన తోట శివాజీ ఇంటికి వచ్చారు. పేర్ని నాని వచ్చిన విషయాన్ని తెలుసుకున్న జనసైనికులు పెద్ద ఎత్తున తోట శివాజీ ఇంటి ముందు నిరసన చేపట్టారు. తమ అధినాయకుడు పవన్ కల్యాణ్ కు చెప్పు చూపించిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. టీడీపీ.. జనసేన కార్యకర్తులు రోడ్లపై బైఠాయించి.. చెప్పులు చూపించారు. దమ్ముంటే బయటకు రావాలని నినాదాలు చేశారు. దీంతో.. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. శివాజీ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అతి కష్టంతో వారిని నిలువరించారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జనసేన అధినేత పవన్ ను ఉద్దేశించి పేర్ని నాని చెప్పులు చూపించి తేల్చుకుందాం రా అని సవాలు విసిరిన సంగతి తెలిసిందే. దానికి ప్రతిగా ఇప్పుడు పేర్ని నానికి.. టీడీపీ, జనసైనికులు చెప్పులు చూపించి.. తేల్చుకుందాం రా అంటూ నినాదాలు చేశారు. పవన్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పేర్ని నాని తన వాహనాన్ని గుడివాడ సమీపంలో నిలిపేసి.. అక్కడి నుంచి స్థానిక వైసీపీ నేత పాలేటి చంటి కారులో వచ్చారు. దీంతో జనసేన కార్యకర్తలు ఆ కారుపై రాళ్లు.. కోడిగుడ్లతో దాడి చేశారు.
ఈ క్రమంలో వాహన అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒక దశలో కారు మీద పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నంగా చేయగా.. పోలీసులు నిలువరించారు. టీడీపీ.. జనసైనికుల ఆందోళతో శివాజీ ఇంట్లోనే గంటల కొద్దీ ఉండిపోయారు పేర్నే నాని. అప్పుడెప్పుడు జరిగిపోయిన ఉదంతంపై జనసైనికులు పేర్ని నానిపై ఎందుకు అంత గుస్సా అవుతున్నారన్న ప్రశ్నకు జనసైనికుల సమాధానం వేరుగా ఉంది.
ఏపీ సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త ఇంటూరి రవికిరణ్ ను పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే. అతడ్ని పరామర్శించేందుకు పేర్ని నాని గుడివాడకు వచ్చారన్న వాదన వినిపిస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు చెబుతున్నారు. తమ అధినేతల్ని మార్ఫింగ్ ఫోటోలతో అవమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే.. అతడ్ని అవమానించేందుకు పేర్ని నాని రావటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆందోళనకారులతో చర్చలు జరిపిన పోలీసులు.. చివరకు వారిని సర్దిచెప్పి బయటకు పంపారు. దీంతో.. కొద్ది సేపటి తర్వాత బయటకు వచ్చిన పేర్ని నాని మరో వాహనంలో వెళ్లిపోయారు.