అంతన్నాడింతన్నాడే గంగరాజు…ముంతమామిడి పండన్నాడే గంగరాజు…కస్సన్నడు బుస్సన్నాడే గంగరాజు….నన్నొగ్గి ఎల్లిపోనాడే గంగరాజు…ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు విన్న తర్వాత రాష్ట్రంలోని జనసైనికుల పరిస్థితికి ఈ పాట అతికినట్లు సరిపోతుందంటే అతిశయోక్తి కాదు. 2014లో మేము తగ్గాం…2024లో మీరు తగ్గండి…అంటూ కొద్ది నెలల క్రితం పవన్ కల్యాణ్ ఇచ్చిన స్టేట్ మెంట్ చూసి జనసైనికుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
ఇంకేముంది, రాబోయే ఎన్నికల్లో కాబోయే సీఎం పవన్ కల్యాణే అంటూ జనసైనికులు నానా హడావిడి చేశారు. సీఎం సీటు పవన్ కు ఇస్తేనే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని, లేదంటూ ఒంటరిగా బరిలోకి దిగి సీఎం పదవి చేపట్టాలని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాను హోరెత్తించారు. ఇక, మరికొందరు జనసేన కార్యకర్తలైతే చంద్రబాబుకు పవన్ కల్యాణే దిక్కు అంటూ పవన్ కు చంద్రబాబు దండం పెడుతున్న ఒక ఫొటోను తెగ వైరల్ చేశారు. మొన్నటికి మొన్న నెల్లూరులో వైసీపీ నేత ఒకరు కాబోయే ముఖ్యమంత్రి పవన్ చేతుల మీదుగా ఫలానా రోడ్డు నిర్మాణం జరగబోతోందంటూ ఏకంగా శిలాఫలకం పెట్టేశారు.
ఇదంతా చూసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు షాక్ తిన్నారు. ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా పొత్తుల గురించి చంద్రబాబు ఆలోచిస్తుంటే జనసేన కార్యకర్తలు మాత్రం టీడీపీకి గతిలేక పొత్తు పెట్టుకుంటొందన్న భావనలో ఉండడం చూసి చంద్రబాబు సైతం ఖంగుతిన్నారట. కట్ చేస్తే..సడెన్ గా పవన్ పొత్తుల గురించి బాంబు పేల్చారు. మనకు సీఎం సీటు అడిగేంత సీన్ లేదంటూ డైరెక్ట్ గానే కుండ బద్దలు కొట్టేశారు. దీంతో, అప్పటి దాకా పవన్ కోసం ఇతర పార్టీల నేతలతో డిబేట్ల మీద డిబేట్లు చేసిన జనసేన నేతలు, కార్యకర్తల ఫీజులు ఎగిరిపోయాయి.
ఇక, పొత్తు మాత్రం పక్కా అని పవన్ చెప్పడంతో టీడీపీ ఇచ్చినన్ని సీట్లు తీసుకొని పొత్తు పెట్టుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదన్న రీతిలో జనసైనికులు ఫిక్సయి తీవ్రంగా డిజప్పాయింట్ అయ్యారు. ఇటు కక్కలేక…అటు మింగలేక కొందరు జనసైనికులు సుప్త చేతనావస్థలోకి వెళ్లిపోయారు. మరికొందరు, కరుడుగట్టిన జనసేన నేతలు, కార్యకర్తలు మాత్రం పార్టీ అధినేత పవన్ మాటే శాససం అంటూ శివగామి చెప్పినట్లుగా ఫీలయ్యి పవన్ ఏం చేసినా రైట్ రైట్ అంటూ పవన్ నిర్ణయానికి మద్దతిస్తున్నారు.
ఇక, మనోభావాలు దెబ్బతిన్న జనసేన కార్యకర్తలను బుజ్జగించేందుకు పవన్ ఆ ప్రకటన చేసిన వెంటనే జనసేన నేతలతో మరో మీటింగ్ పెట్టారు. తన వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలని, పొత్తులు పెట్టుకుంటేనే పార్టీ ప్రయోజనాలు కాపాడగలమని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, మెజారిటీ జనసేన నేతలు, కార్యకర్తలు మాత్రం పవన్ నిర్ణయంతో విబేదిస్తున్నారు.
ఏది ఏమైనా, తాజా ప్రకటనతో పవన్ మరోసారి తన నిలకడలేమితనాన్ని, రాజకీయ అస్థిరతను నిరూపించుకున్నారని వైసీపీ నేతలు ట్రోలింగ్ చేస్తున్నారు. మరి, పొత్తులపై పవన్ ప్రకటన జనసేనను చిత్తు చేస్తుందా లేదా అన్నది తేలాలంటే మరొకొద్ది రోజులు వేచి చూడక తప్పదు.