చాలాకాలంగా కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల జపం చేస్తున్న సంగతి తెలిసిందే. “వన్ నేషన్.. వన్ ఎలక్షన్”..అంటూ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ప్రధాని మోదీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. అయితే, గత ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్ను లొట్టబోయింది. ఈ క్రమంలో ఈ సారి పక్కాగా జమిలి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ పెద్దలు కృత నిశ్చయంతో ఉన్నారు.
దీంతో, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం ఫిక్స్ అయిందని తెలుస్తోంది. విస్తృత సంప్రదింపుల కోసం ఈ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపే అవకాశముందని సమాచారం. అయితే, జమిలి ఎన్నికలను బీజేపీపాలిత రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కేవలం తమ స్వలాభం కోసమే మోదీ జమిలి జపం చేస్తున్నారిన ఇండియా కూటమి నేతలు విమర్శిస్తున్నారు.
భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ బిల్లుకు సంబంధించి పలు సిఫారసులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఆమోద ముద్ర కూడా వేసింది. దీంతో, ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందితే జమిలి ఎన్నికలు 2027లో జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే జరిగితే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.
ఈ బిల్లు ఇరు సభల్లో ఆమోదం పొందితే కోవింద్ కమిటీ సిఫార్సు ప్రకారం ONOP రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారు. రెండో దశలో సాధారణ ఎన్నికలు జరిగిన 100 రోజుల లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు. బెల్జియం, స్వీడన్, దక్షిణాఫ్రికా , నేపాల్ లకు జమిలి ఎన్నికలు నిర్వహించిన అనుభవం ఉంది.