ఏపీ రాజకీయాలు ఏ దిశగా నడుస్తున్నాయి? ముఖ్యమంత్రి జగన్ దూకుడు చివరకు ఎక్కడికి
వెళ్లి ఆగుతుంది? న్యాయవ్యవస్థను, ముఖ్యంగా ఓ న్యాయమూర్తిని కార్నర్ చేసుకున్న సర్కారు పరిస్థితి ఏంటి? వైసీపీ సర్కారు నిలిచి.. నిలదొక్కుకుంటుందా.. లేక వివాదాల సుడిలో విచ్ఛిన్నమై.. తమిళనాడు మాదిరిగా మారిపోతుందా?.. ఇవీ.. ఇప్పుడు రాజకీయ అవనికపై మేధావులను సైతం ఆలోచింప జేస్తున్న ప్రశ్నలు. రాజకీయాలకు రంగు-రుచి-వాసన.. లాంటివి అస్సలు ఉండవు. అవకాశం-అవసరం
అనే రెండు చక్రాలే కీలకం. అవి ఎక్కడ చిక్కినా.. ఎప్పుడు ఎదురైనా.. నేతలు, పార్టీలు వదులుకునే ఛాన్సే లేదు.
ఏపీ రాజకీయాలను గమనిస్తున్నప్పుడు.. ప్రస్తుత వివాదం పైకి ఒకలా కనిపిస్తుంటే.. తెరవెనుక మరేదో
జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. దీనివెనుక బీజేపీ ఉందో లేదో ఇతమిత్థంగా తెలియదు కానీ.. పరిణామాలను గమనిస్తే.. తెరవెనుక ఉన్నట్టే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ ఏర్పడిన పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు సాగిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైసీపీలో చీలిక తీసుకురావడం ద్వారా.. ఆపార్టీని శాసించే దిశగా.. తెరవెనుక తమ వ్యూహాన్ని అమలు చేసుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోందనే ఊహాగానాలు వినిపిస్తుండడం గమనార్హం.
ఈ క్రమంలో తమిళనాడు రాజకీయం ఏం జరిగిందో చూద్దాం.. అక్కడ అన్నాడీఎంకే అధినేత్రి.. ముఖ్య మంత్రి జయలలిత అనారోగ్యంతో హఠాన్మరణం చెందారు. ఈ క్రమంలో ఆమె నెచ్చెలి శశికళ పెత్తనం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న బీజేపీ.. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని అదే పార్టీ నుంచి ఎంపిక చేసి.. పగ్గాలు అప్పగించేందుకు ప్రయత్నించింది. దీనికి శశికళ ససేమిరా.. అనడం.. తర్వాత పరిణామాలు.. అందరికీ తెలిసిందే. ఇక, ఇటీవల విడుదల అవుతున్నారని వార్తలు వచ్చినా.. మరేదో కేసులో ఇరుక్కున్నారని.. విడుదల కష్టమేనని తెలిసింది. మొత్తానికి బీజేపీ నేరుగా సర్కారులో లేకపోయినా.. బీజేపీ కనుసన్నల్లో నడిచే నాయకుడే అక్కడ పాలన చూస్తున్నారు.
ఏపీలోనూ ప్రస్తుతం వివాదం ముదిరి.. లేదా అవినీతి కేసుల్లో సీబీఐ విచారణ పూర్తయి.. సీఎం జగన్ కనుక ఊహించని పరిణామంగా జైలుకు వెళ్లాల్సి వస్తే.. ఆయన తన సతీమణి భారతి లేదా మాతృమూర్తి విజయమ్మకు సీఎం పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇక్కడే కేంద్రంలోని బీజేపీ వ్యూహాత్మకంగా చక్రంతిప్పుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీలో పెరిగిన అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకుంటోందని అంటున్నారు పరిశీలకులు. వైసీపీ అసమ్మతి నాయకుడు, క్షత్రియ వర్గానికి చెందిన నరసాపురం ఎంపీ.. ఇప్పుడు బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తున్నారనేది జగమెరిగిన సత్యం.
ఆయన కోరగానే వై
కేటగిరి భద్రత ఇచ్చారు. ఆయనకు స్థాయీ సంఘంలో పదవి ఇచ్చారు. అడగగానే అప్పాయింట్మెంట్ ఇస్తున్నారు. ఇలా అన్నివిధాలా కేంద్రంలోని బీజేపీ సహకరిస్తోంది.ఇక, ఆది నుంచి రఘురామ కూడా బీజేపీకి అత్యంత సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేయడం, కుటుంబ సమేతంగా ఆయనను కలుస్తూ ఉండడం వంటివి పరోక్షంగా ఆయన బీజేపీ నేతేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఇప్పుడు ఈయన వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో.. ప్రస్తుతం వైసీపీని నేరుగా టార్గెట్ చేయడం, సీఎం జగన్ వైఖరిని కడిగేయడం అనే విషయాల్లో ఆయనను మించిన నాయకుడు లేరు. వ్యూహాత్మకంగా వ్యవహరించడం లోనూ ఆయన సక్సె స్ అవుతున్నారు.
దీంతో వైసీపీలో ఎలాగూ.. సగానికిపైగా ఎమ్మెల్యేలు.. అసంతృప్తితో ఉన్నారు. వీరంతా.. రఘురామరాజు.. వైసీపీని విమర్శిస్తే.. తెరవెనుక ముసిముసిగా నవ్వుతున్నారనేది… వైసీపీలోని మిగిలిన నాయకులు చెప్పుకుంటున్న మాట. దీంతో ఆయనకు అనుకూలంగా రేపు సగం మంది చేరితే.. ఆయననే సీఎం సీటులో కూర్చోబెట్టినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.
విశేషం ఏంటంటే.. ఒక సర్వేలో ముఖ్యమంత్రిగా జగన్‌కు 36 శాతం మంది ఆమోదం తెలిపితే.. రఘురామకృష్ణంరాజు 41 శాతం ఓటింగ్‌తో పైచేయి సాధించారట. పార్టీలు చీలడం, నేతలు మారడం అనేది రాజకీయాల్లో మామూలే. సో.. వైసీపీ నేతలు కూడా అందుకు అతీతం కాదు.. కాబట్టి.. గుర్రం ఎగరావచ్చు.. బీజేపీ వ్యూహం ఫలించావచ్చు.. రఘురామ రాజు సీఎం అయినా అవ్వావచ్చు అంటున్నారు.. మరి ఏం జరుగుతుందో చూడాలి.