ఏమైనా నాలుగు మంచి మాటలు చెప్పాలంటే దానికో అర్హత అవసరం. ఇప్పుడు అలాంటి రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. ఎవరైతే తనకు తోచినట్లుగా వ్యవహరిస్తారో.. వారే విలువల గురించి.. ప్రమాణాల గురించి.. మాట నిలబెట్టుకోవటం గురించి మాట్లాడతారట. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలన ఎలా ఉందన్న విషయాన్ని తెలుగు రాష్ట్రాల్లోని వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తన రాజకీయ ప్రత్యర్థులు సైతం తన తీరుకు ఫిదా అవుతారన్న మాటల్నిప్రమాణస్వీకారం రోజున చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. ఆ తర్వాతేం చేశారు? ప్రతిపక్ష నేతల్ని తర్వాత.. వారి పార్టీ ఆఫీసులపైనా తమ పార్టీకి చెందిన కార్యకర్తల రూపంలోని గూండాల్ని పంపి.. భౌతిక దాడులు చేయించటం.. పార్టీ ఆఫీసులను ధ్వంసం చేయటం లాంటివి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు ముందు చూసింది లేదు. ఏదైనా ఒకటి అరా సంఘటనలు జరిగినా.. ప్రత్యేక సందర్భాల్లో చోటు చేసుకున్నాయి.
అంతే తప్పించి.. సాదాసీదాగా ఉన్న రోజుల్లో టార్గెట్ చేసి మరీ పార్టీ ఆఫీసుల మీదకు దాడికి దిగే కొత్త కల్చర్ కు ఏపీ వేదికగా మారింది. ఇలాంటి దరిద్రపుగొట్టు అలవాట్లు ఏ రాష్ట్రానికి మంచిది కాదు. దాని ఫ్యూచర్ కు ఇలాంటి ఉదంతాలు దారుణంగా దెబ్బ తీయటం ఖాయం. అయినప్పటికీ తాను చేసిన తప్పుల్ని అస్సలు పట్టించుకోకుండా.. ఎదుటివారి తప్పుల్నిమాత్రమే వేలేత్తి చూపించే టాలెంట్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కాస్తంత ఎక్కువనే చెప్పాలి. తాజాగా తెనాలిలో నిర్వహించిన సభలోనూ ఇలాంటి తీరునే ప్రదర్శించారు. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలకు.. విలువలకు నీతి చంద్రిక సైతం నిర్ఘాంతపోయే పరిస్థితి. ఇంతకీ ఆ సభలో ఆయనేం మాట్లాడారు. ఆయన నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాల్లాంటి మాటల్ని ఆయన మాటల్లోనే చెప్పుకొస్తే..
– మేం ఒంటరిగా పోటీ చేస్తాం. రాష్ట్రంలోని ఇతర పార్టీలూ ఒంటరిగా.. ఎవరికి వారుగా పోటీ చేయాల్సిందే
– దేవుడి దయ, ప్రజల చల్లని ఆశీస్సులపై నేను ఆధారపడ్డాను. అందుకే భయం లేకుండా 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని చెబుతున్నా.
– 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి ఉందా? వాళ్లకు ధైర్యం లేదు. ఎందుకంటే ప్రజలకు వాళ్లు మంచి చేసిన దాఖలాలే లేవు. ప్రజలకు మేలు చేశానన్న నమ్మకం, ధైర్యం ఉంది కాబట్టే అన్నీ స్థానాల్లో గెలుస్తామని చెబుతున్నాను
– రాబోయే రోజుల్లో దుష్టచతుష్టయం చేసే కుట్రలు, అన్యాయాలు ఇంకా పెరుగుతాయి. ప్రజలు అన్నీ గమనించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి.
– రాష్ట్రంలో యుద్ధం జరుగుతున్నది కులాల మధ్యన కాదు. ఇది క్లాస్ వార్. ఒకపక్క పేదవాళ్లు, మరోవైపు పెత్తందార్లు. పొరపాటు జరిగితే రాజకీయాల్లో మాట ఇవ్వడం, దానిని నిలబెట్టుకోవడం అనే మాటకు అర్థం లేకుండా పోతుంది. అంతేకాకుండా పేదలు అనేవాళ్లు లేకుండా మటుమాయం అవుతారు.
– రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. విశ్వసనీయతకు అర్థం తెలియాలి. ఒక మాట చెప్పి అది నిలబెట్టుకోకపోతే రాజకీయాలకు ఆ వ్యక్తి అనర్హుడనే పరిస్థితి రావాలి.
– మూడు సంవత్సరాల ఎనిమిది నెలల వైసీపీ పాలనలో పెట్టుబడి సాయం, వడ్డీ లేని రుణాలు, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, విద్యుత్ రూపంలో ఒక్క రైతులపైనే రూ.లక్షా 45 వేల కోట్లు ఖర్చు చేశాం.
– చంద్రబాబుది పెత్తందార్ల పార్టీ. మాది రైతు ప్రభుత్వం. రైతులకు మంచిచేయని చంద్రబాబు ఒకవైపు, మంచి చేసిన మేం ఒక వైపు ఉన్నాం. పేదలకు రూ.లక్ష 93 వేల కోట్ల నగదును నేరుగా వాళ్ల ఖాతాల్లో జమ చేసే(డీబీటీ) సిద్ధాంతం మాది.
– గజదొంగల ముఠాకు చంద్రబాబు బాస్. ఆ రోజున కూడా ఇదే బడ్జెట్ ఉంది. అప్పుడు ప్రజలకు జరగని మంచి ఇప్పుడెందుకు జరుగుతుందో ఆలోచన చేయాలి?