ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిపదవిలో ఉంచకూడదని వ్యాఖ్యానించారు. తాజాగా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన జగన్.. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌పై తనదైన శైలిలో ప్రశ్నలు, విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు అన్ని వర్గాలను విస్మరించారని విమర్శించారు.
చంద్రబాబు చెప్పిన సూపర్-6 అమలు చేసేందుకు బడ్జట్లో దాదాపు 80 వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉందని జగన్ చెప్పారు. అయితే.. ఈ సొమ్ములు కేటాయించకుండా.. గత ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జట్‌లోనే మోసం చేశారని, ఇప్పుడు కూడా అలానే ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీకి చెందిన లబ్ధిదారులకు పథకాలు అమలు చేయొద్దని చెబుతున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలో ఉన్నప్పుడు.. టీడీపీ వారికి కూడా న్యాయం చేశామని.. అనేక మందిని పథకాల జాబితాలో చేర్చామని చెప్పారు.
కానీ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు వైసీపీ వారికి పథకాలు ఇవ్వొద్దని చెబుతు న్నారని.. ఇది కరెక్ట్ కాదని అన్నారు. ఇలాంటి వారిని ఒక్క నిమిషం కూడా.. ముఖ్యమంత్రి పదవిలో ఉంచకూడదని జగన్ వ్యాఖ్యానించారు. “ ప్రజలు కట్టిన సొమ్ములతోనే పథకాలు ఇస్తున్నారని.. మా పాలనపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు తన జేబులో సొమ్ము ఇస్తున్నట్టు చెబుతున్నాడు. ఈ మాట అనడానికి చంద్రబాబు ఎవరు. పక్షపాతానికి, రాగ ద్వేషాలకు అతీతంగా పని చేస్తానని హామీ ఇచ్చి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడు“ అని విమర్శించారు.
రాష్ట్రంలో సూపర్-6 పథకాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని.. వాటిని తీర్చడం మానేసి.. నిరంతరం సభలో లేని వైసీపీపై నోరు పారేసుకుంటున్నారని జగన్ అన్నారు. సభకు తాము ఎందుకు వెళ్లడం లేదో ప్రజలకు కూడా తెలుసునని.. తాము వెళ్లినా.. తమకు మైకు ఇవ్వరని.. పైగా తిట్టించుకోవాలని.. అందుకే సభకు వెళ్లడం లేదని జగన్ మరోసారి వ్యాఖ్యానించారు. తాము మీడియా ముఖంగా ప్రజల తరఫున వారి సమస్యలపై నిరంతరం ప్రస్తావిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు.