అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను అడుగడుగున అడ్డుకునేందుకు వైసిపి నేతలు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర చేస్తున్న రైతులకు అడ్డుపడుతున్న వైసీపీ శ్రేణులు నల్లబెలూన్లు, ప్రకార్డులు పెట్టుకొని పాదయాత్రపై విషం చిమ్ముతున్న వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం, వైసిపి నేతలు వినూత్న ప్రయత్నాలు పెట్టారు.
తాజాగా రాజమండ్రిలోని రోడ్ కం రైలు వంతెనను నేటి నుంచి వారం రోజులు పాటు మూసివేస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర రాజమండ్రిలో చేరుకునే సమయంలోనే ఈ మరమ్మతులు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టిడిపి సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.
ఈ నెల 17న రాజమండ్రి బ్రిడ్జి మీదుగా అమరావతి రైతుల మహా పాదయాత్ర సాగాల్సి ఉందని, అందుకు రూట్ మ్యాప్ చాలా కాలం క్రితం సిద్ధమైందని గోరంట్ల చెప్పారు. పాదయాత్ర అడ్డుకునేందుకే మరమ్మతుల పేరుతో బ్రిడ్జిని మూసివేశారని గోరంట్ల ఆరోపించారు. కొంచెమైనా సిగ్గుండాలి అంటూ ప్రభుత్వంపై గోరంట్ల మండిపడ్డారు. ఇన్నాళ్లు మరమ్మతులు చేయాలని గుర్తుకు రాలేదుగానీ పాదయాత్ర సమయంలోనే ఎందుకు గుర్తొచ్చింది అని గోరంట్ల నిలదీశారు.
గతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో చంద్రబాబు ఇలాగే చేసి ఉంటే ఏం చేసేవాడివి జగన్ అంటూ గోరంట్ల ప్రశ్నించారు. ఇలా చేయడం శాడిస్ట్ ఆలోచనలకు పరాకాష్ట తప్ప మరొకటి కాదని గోరంట్ల ఘాటుగా విమర్శలు గుప్పించారు.