మూడు రాజధానుల్లో భాగంగా విశాఖపట్నంపై ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టిన వైసీపీ అధినేత జగన్ అక్కడ టీడీపీని దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్నారు. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించడం ద్వారా పట్టు సాధించి.. ఎంపీ సీటునూ సొంతం చేసుకోవాలనే టార్గెట్ పెట్టుకున్నారు. సిటీలో ఉన్న నాలుగు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కనీసం మూడింట్లోనైనా వైసీపీ జెండా ఎగరేయాలన్నది జగన్ ప్లాన్‌గా తెలుస్తోంది.
విశాఖ ఎంపీ సీటు కోసం వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మీ, టీడీపీ అభ్యర్థి ఎంవీవీఎస్ మూర్తి మధ్య టైట్ వార్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లోని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించి ఆ పార్టీని దెబ్బకొట్టాలని జగన్ అనుకుంటున్నారు. ఇక్కడ విశాఖ తూర్పులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామక్రిష్ణబాబు వరుసగా మూడు సార్లు గెలిచారు. విశాఖ పశ్చిమలో టీడీపీ ఎమ్మెల్యే గణబాబు రెండు సార్లు విజయఢంకా మోగించారు. వీళ్లకు ఈ సారి చెక్ పెట్టాలని జగన్ చూస్తున్నారు. అందుకే వెలగపూడిపై పోటీకి ఎంవీవీ సత్యనారాయణను, గణబాబుపై పోటీకి ఆడారి ఆనంద్‌కుమార్‌ను బరిలో దించారు.
ఈ ఇద్దరు వైసీపీ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వరుసగా అధికారంలో ఉన్నప్పటికీ ఈ టీడీపీ ఎమ్మెల్యేలు ఏం చేయలేదనే విమర్శిస్తున్నారు. ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటే అది కచ్చితంగా తమకు ప్లస్ అవుతుందని ఆశిస్తున్నారు. అందుకే వీళ్ల గెలుపు కోసం వైసీసీ క్యాడర్ ఎక్కువగా కష్టపడుతోంది. కానీ ఆయా నియోజకవర్గాల్లో టీడీపీకి ఓటు బ్యాంకు బలంగా ఉంది. అక్కడక్కడా కాస్త అసంతృప్తి ఉన్నా అది పెద్దగా ప్రభావం చూపించదనే అభిప్రాయం ఉంది. పైగా జగన్‌పై వ్యతిరేకత కూడా క్రమంగా పెరుగుతోందని అంటున్నారు. మరి వైజాగ్‌లో జగన్ ప్లాన్ ఫలిస్తుందా అన్నది చూడాలి.