వైసీపీ హయాంలో పట్టాదారు పాస్ పుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోను ముద్రించిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోను పట్టాదారు పాస్ పుస్తకాలపై ప్రింట్ చేసిన వైనం విమర్శలకు తావిచ్చింది. ఈ వ్యవహారంపై జగన్ ను ట్రోల్ చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫోటో తొలగిస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం తాజాగా ఆ పుస్తకాలపై జగన్ ఫోటోని తీసేసి ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలను అందించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సమీక్షలో పాల్గొన్న చంద్రబాబు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పరిశీలించారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
పట్టాదారు పాస్ పుస్తకాలపై తన బొమ్మ వేసుకొని జగన్ తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని, అటువంటి గత పాలకుడి తప్పులను సరిదిద్దుతున్నామని చంద్రబాబు అన్నారు. తాత, తండ్రి ఇలా వారసత్వంగా తమకు సంక్రమించిన ఆస్తులపై ఎవరి బొమ్మ ఉండకూడదన్నది ప్రజాభిప్రాయమని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాజమద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.