ఏపీలో ఐదేళ్లపాటు పాలన సాగించిన వైసీపీ అధినేత జగన్ చేసిన తప్పుల్లో కొన్ని ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో సుపరిపాలన తీసుకువస్తానని పదే పదే చెప్పారు జగన్. ఊరూవాడా కూడా ప్రచారం చేసుకున్నా రు. తాను చేసిన ప్రజాసంకల్ప యాత్రలోనూ.. “సుపరి పాలన అంటే అర్థం తెలుసా ఈ చంద్రబాబుకి?“ అని నిలదీశారు. మైకు లు పగిలేలా ప్రశ్నించారు. సరే.. ప్రజలు నమ్మారు.. పట్టం కట్టారు. జగన్కు అధికారం కట్టబెట్టారు. మరి నిజంగానే జగన్ `సుపరి పాలన` అందించారా? లేక `స్వపరిపాలన` చేసుకున్నారా? అంటే రెండోదే సమాధానంగా వినిపిస్తోంది.
సుపరిపాలన చోటులో ఆయన స్వపరిపాలనను తీసుకువచ్చారు. పదవుల్లో తమ వాళ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. పైకి రెడ్డి సామాజిక వర్గానికి పదవులు ఇవ్వలేదంటూనే.. బీసీలు, ఎస్సీలకు, ఎస్టీలకు పదవులు కట్టబెట్టానని చెబుతూనే.. పైనుంచి కర్ర పెత్తనమంతా.. రెడ్డి వర్గంలోని కొందరు ఎంపిక చేసిన నాయకులకు.. వారు కూడా.. తన వారికి మాత్రమే జగన్ అప్పగించారనే నిష్ఠుర సత్యం. ప్రతి పక్షంలో కుల పక్షపాతం గురించి ఎంతో మాట్లాడిన జగన్ తన వరకు వస్తే.. మాత్రం సూర్యుడు ఎటునుంచై నా ఉదయించవచ్చు.. తప్పేంటన్న వితండవాదానికే దిగారు. ప్రభుత్వంలో అందరూ సొంత కులం వాళ్లే.. రాజకీయంగా అన్ని మూడు ప్రాంతాలూ సామంతుల్లా ఏలిన విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి వంటివారిపై విమర్శలు వచ్చినా.. జగన్ శీతకన్నేశారు.
ఇక, సకల శాఖా మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్నారెడ్డి విషయం ఎంత తక్కువ చెబితే అంత ఎక్కువ అన్నట్టు! జగన్ కు ఆయనే కళ్లూ చెవులు అయిపోయారు. మితిమీరిన సలహాదారుల్లో సజ్జల సన్నిహితులు, స్నేహితులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. మొత్తంగా ఇటు సర్కారులోనూ.. అటు పార్టీలోను అందరూ `ఈ రెడ్లు` చెప్పినట్లు వినాలి. చెప్పింది చేయాలి! అనే రేంజ్లో జగన్ విజృంభించారు. ఇదే విషయాన్ని మింగలేక.. కక్కలేక.. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఓటమి ఎరుగని కాటసాని రాంభూపాల్ రెడ్డి వంటివారు కడుపు చింపేసుకున్నారు!!
ఇక, సర్కారీ సంస్థలు.. ఉన్నత విద్యావేత్తలకు పట్టకట్టాల్సిన కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, నామినేటెడ్ పోస్టులు అన్నీ రెడ్లతో నింపేశారు. అవతలి వాళ్లని(డీఎస్పీలను బదిలీ చేసినప్పుడు కమ్మలకు ఇచ్చారంటీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు యాగీ చేశారు వైసీపీనాయకులు) కులం గురించి మాట్లాడే జగన్.. తన దాకా వస్తే.. స్వపరిపాలనకే పెద్దపీట వేసుకున్నారు తప్ప.. సుపరిపాలనను బుట్టదాఖలు చేసుకున్నారు. ఎటు నుంచి ఏ కోణంలో చూసుకున్నా.. జగన్ తప్పుల్లో కీలకమైన స్వపరిపాలనను ప్రజలు ఎప్పుడో గుర్తించారు. కానీ, జగనే గుర్తించలేక.. దానినే సుపరిపాలన అనుకున్నారు. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నట్టు చెప్పుకొచ్చారు.
ఇంతకీ చెప్పేదేంటి?
ఈ మొత్తం ఎపిసోడ్లో చెప్పేది ఒక్కటే అది చంద్రబాబు అయినా..జగన్ అయినా.. సుపరిపాలన పేరుతో స్వపరిపాలనకు పెద్ద పీట వేస్తే.. 2024 ఫలితం ఒక్కరికే పరిమితం కాదు. రేపు ఎవరికైనా రావొచ్చు. బహుశ అందుకేనేమో.. చంద్రబాబు చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు. మంత్రివర్గంలో `ఆస్థాన విద్వాంసుల`ను, `ఆస్థాన నర్తకీమణులను`.. చక్కగా ముందే పక్కన పెట్టేశారు. ఇది వచ్చే ఐదేళ్లు కొనసాగితే.. మంచిదే.. గాడి తప్పకుంటే చూసుకుంటే మరో పదేళ్లు ఖచ్చితంగా అధికారం కూడా ఆయనదే!!