ఏపీలో తాను చేపట్టినన్ని సంక్షేమ పథకాలు మరే సీఎం చేపట్టలేదని జగన్ గొప్పలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, జగన్ అమలు చేస్తున్న పథకాలలో కేంద్రం వాటా కూడా ఉందని, కానీ కేంద్రం పేరు తీసేసి ఆ పథకాలకు తన పేరున, తన తండ్రి పేరును జగన్ పెట్టుకుంటున్నారని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పేర్ల సంగతి అలా ఉంచితే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కోసం ఇచ్చిన నిధులను సైతం జగన్ దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
అంతేకాదు, సొమ్మొకడిది సోకొకడిది తరహాలో కేంద్రం డబ్బులకు జగన్ పేరు పెట్టుకోవడంపై కూడా కేంద్రం పెద్దలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పై బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తప్పుడు లెక్కలు, ఉత్తుత్తి ప్రకటనలతో ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. జల్ జీవన్ మిషన్ లెక్కలను టాంపరింగ్ చేశారని సత్యకుమార్ సంచలన ఆరోపణ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్రం జల్ జీవన్ మిషన్ పథకం చేపట్టిందని, అయితే, ఏపీలో ఆశించిన ఫలితాలు తీసుకురావడంలో జగన్ విఫలమయ్యారని ఆరోపించారు.
ఏపీలో ఈ పథకం 100% అమలైందని కేంద్రానికి జగన్ లెక్కలు పంపారని, కానీ కేవలం 20 శాతం గ్రామాలకు మాత్రమే ఈ పథకం ఫలాలు అందాయని సత్యకుమార్ ఆరోపించారు. రాష్ట్రంలోని 354 గ్రామాలకు 100% కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్టుగా లెక్కలు చూపారని, కానీ, 735 గ్రామ పంచాయతీలలో మాత్రమే పని పూర్తి చేశారని అన్నారు. అంటే, కేవలం 20% పని చేశారని మిగిలిన 80 శాతం మోసమేనని సత్యకుమార్ మండిపడ్డారు.
ఇలాంటి తప్పుడు లెక్కలు చూపించడంలో జగన్ సిద్ధహస్తుడని, ఇటువంటి సలహాలు ఇచ్చేందుకే ప్రత్యేకంగా 45 మంది సలహాదారులను పెట్టుకొని వారికి 130 కోట్లు ఖర్చు పెడుతున్నారని జగన్ ను దుయ్యబట్టారు. అంతేకాదు, తప్పుడు ప్రచారంతోనే జగన్ మూడున్నరేళ్ల పాలన సాగిందని సత్యకుమార్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.