చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరించే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలువెత్తు రూపంగా నిలుస్తారు. ఆయన నోరు తెరిస్తే చాలు.. అక్కచెల్లెమ్మలు.. అన్న తమ్ముళ్లు.. అంటూ కలిపేసే పులిహోర.. నా ఎస్సీ.. నా బీసీ అంటూ మరింత పోపును దట్టిస్తుంటారు. మాటల్లో ఇంతటి అభిమానాన్ని ప్రదర్శించే జగన్.. చేతల్లోకి వచ్చేసరికి ఎలా ఉంటారన్న దానికి ఆయన తీసుకునే నిర్ణయాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
నా ఎస్సీ.. నా బీసీ.. నా మైనార్టీలు.. వీరితో పాటు మహిళలకు సైతం పదవుల్లో యాభైశాతాన్ని ఇస్తామని చెప్పే సీఎం జగన్.. చేతల విషయానికి వస్తే.. పదవుల్లో సింహభాగం ఒక సామాజిక వర్గానికి మాత్రమే ఇవ్వటం కనిపిస్తుంది. ఏదో మాట వరసకు అన్నట్లు కాకుంటే.. పలు నియోజకవర్గాలు.. వాటిల్లో అప్పజెప్పిన పదవులు.. వాటిని అనుభవిస్తున్న వారిని చూస్తే.. ఒక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చిన వైనం ఇట్టే అర్థమవుతుంది.
ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ కడప జిల్లాలో 75 శాతం పదవులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే దక్కటం చూస్తే.. జగన్ మాటలు నేతి బీరకాయను తలపిస్తాయి. నేతి బీరకాయ పేరులోనే నేతి తప్పించి.. అందులో ఉండదన్న విషయం తెలిసిందే. జగన్ మాటల్లో తరచూ వినిపించే.. నా ఎస్సీ.. నా బీసీ.. నా మైనార్టీ అన్ని కూడా మాటలకే పరిమితమన్నది కనిపిస్తుంది.
ఇటీవల రాష్ట్రంలోని జిల్లాల వారీగా మండలాల అధ్యక్ష పదవుల్ని ప్రకటించారు. ఇందులో రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలతో పాటు.. ప్రకాశం.. నెల్లూరు జిల్లాల్లోని నేతలకు లభించిన పదవుల్లో అత్యధికులు ఒకే వర్గానికి చెందిన వారు కావటం గమనార్హం. ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ కడప జిల్లాలోని 8 మండలాల అధ్యక్ష పదవుల్లో 7 పదువుల్ని ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టటం గమనార్హం.
అంతేకాదు..కమలాపురం.. ఆత్మకూరు.. బనగానపల్లె లాంటి నియోజకవర్గాల్లో అయితే వందకు వంద శాతం ఒకే సామాజిక వర్గానికే పదవులు ఇవ్వటం కనిపిస్తుంది. జనరల్ నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితిని సర్లే అనుకున్నా.. యర్రగొండపాలెం.. పూతలపట్టు.. బద్వేలు.. నందికొట్కూరు.. సూళ్లూరుపట లాంటి రిజర్వు నియోజకవర్గాల్లోనూ ఒకట్రెండు మండలాలు తప్పించి మిగిలిన మండలాలకు ప్రకటించిన మండల అధ్యక్ష పదువులు మొత్తం ఒకే సామాజిక వర్గానికే చెందిన వారు కావటం గమనార్హం.
మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన యర్రగొండపాలెంలోని అన్ని మండలాల పదవులు ఒకే సామాజిక వర్గానికి దక్కటాన్ని తప్పు పడుతున్నారు. సీఎం జగన్ నోరు విప్పితే చాలు ఎస్సీ.. బీసీ.. మైనార్టీ.. మహిళల గురించి ప్రస్తావించే ఆయన.. తాజాగా ప్రకటించిన పదవుల్లో మహిళలకు ఇచ్చిన పదవుల లెక్క తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వైసీపీ మండల అధ్యక్ష పదవుల్లో ఉమ్మడి రాయలసీమ జిల్లాలైన నాలుగింటితో పాటు నెల్లూరు.. కావలి.. ప్రకాశం జిల్లాలతో కలిపితే మొత్తం ఏడు జిల్లాలు అవుతాయి. వీటిల్లో మహిళలకు దక్కిన పదవులు అక్షరాల రెండు మాత్రమే.
సీఎం సొంత జిల్లా వైఎస్సార్ కడపలో తాజాగా ఇచ్చిన పదవుల్లో 75 శాతం ఒకే సామాజిక వర్గానికి ఇవ్వగా.. సీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 49 శాతం.. ఉమ్మడి ప్రకాశం.. నెల్లూరు జిల్లాల్లో 58 శాతం.. ఎస్సీ రిజర్వు నియోజకవర్గాలైన సూళ్లూరు పేటలో 63 శాతం.. గంగాధర నెల్లూరు.. సత్యవేడు.. కొండపిలో 50 శాతం చొప్పున.. రైల్వే కోడూరు.. మడకశిరలో 40 శాతం.. శింగనమల.. సంతనూతలపాడులో 33 శాతం.. కోడుమూరులో 25 శాతం పదవులు ఒక్క సామాజిక వర్గానికే ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తీరును తప్పు పడుతున్నారు.