ఏపీలో కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు వ్యవహారంపై కొంతకాలంగా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే సీపీఎస్ ను రద్దు చేస్తామని నాటి ప్రతిపక్ష నేతగా నేటి సీఎం జగన్ ఇచ్చిన హామీని ఆయన తుంగలో తొక్కారని ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీని జగన్ నెరవేర్చాలంటూ కొద్ది నెలలుగా ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి బొత్స నేతృత్వంలోని మంత్రుల బృందం ఎన్నోసార్లు చర్చలు జరిగింది.
అయినా సరే ఆ చర్చలు అసంపూర్తిగానే ముగుస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వ తీరేకారణమని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. సీపీఎస్ రద్దుపై నోరు జారి హామీ ఇచ్చామని, దానిని అమలు చేయడం సాధ్యం కాదని సజ్జల, బొత్స వంటి నేతలు జగన్ టంగ్ స్లిప్ అయిన విషయాన్ని ఒప్పుకున్నారు. కానీ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రం సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని, ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
ఓపీఎస్ మినహా మరే విషయంపై చర్చించేందుకు తమను పిలవద్దని కరాఖండిగా వారు చెప్పేశారు. అంతేకాదు, తమ డిమాండ్లను సత్వరమే పరిష్కరించకుంటే మరోసారి పోరు బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దీంతో, ఈ ఏడాది డిసెంబర్ నాటికి సీపీస్ వ్యవహారంపై ఓ నిర్ణయం తీసుకుంటామని బొత్స నాన్చుడు ధోరణిలో వ్యవహరించారు. దీంతో, బొత్స చేసిన ప్రకటనపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
ఈ క్రమంలోనే పుండు మీద కారం చల్లినట్టుగా సీపీఎస్ రద్దుపై జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది. 2004 సెప్టెంబర్ 1 నాటికి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి మాత్రమే సీపీఎస్ రద్దు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా పుకార్లు వస్తున్నాయి. అంతేకాదు, ఈ ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల వివరాలు, వారు సర్వీసులో చేరిన తేదీలను పంపాలంటూ ఆ శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.
ఆ సమగ్ర వివరాలతో బుధవారం జరగబోయే సమావేశానికి హాజరు కావాలంటూ అధికారులకు, ఆయా శాఖల ఉన్నత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఈ సమావేశంలో సీపీస్ రద్దు, ఓపీఎస్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం 2004 లోపు ఉద్యోగాలలో చేరిన వారికి మాత్రమే సీపీస్ రద్దు అంటే మిగిలిన ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు అంగీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.