జగన్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని, గొప్పలకు పోయి ఏపీని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని టీడీపీ సహా విపక్షాలన్నీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని విపక్షాలతోపాటు కంప్ట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ (కాగ్) కూడా చాలాసార్లు చెప్పింది. జగన్ ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో దాదాపు అర్థ రూపాయి అప్పేనని ఎన్నోసార్లు తేల్చింది. ఏపీ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిందని, ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలిచ్చేందుకు కూడా తిప్పలు పడుతోందని తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అయినా సరే, ఏపీ అప్పుల కుప్పను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు జగన్.
మూడేళ్ల పాలనలో జగన్ దాదాపు ఐదున్నర లక్షల కోట్లు అప్పు చేశారని, అందులో ముచ్చటగా మూడు లక్షల కోట్లకు లెక్కలు లేవని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాదు, జగన్ చేసిన అప్పుల చిట్టాను గణాంకాలతో సహా వారు బట్టబయలు చేస్తున్నారు. అయితే, జగన్ కు షాకిచ్చే గణాంకాలను ఆయన ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న దువ్వూరి కృష్ణ గతంలో వెల్లడించారు. 2022 ఏడాది మార్చి నాటికి ఏపీ మొత్తం అప్పులు రూ.4,98,799 కోట్లకు చేరుకున్నాయని షాకింగ్ విషయం చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ఏపీలో అప్పుల వ్యవహారంపై గతంలోనే కేంద్రం ఫోకస్ పెట్టింది. జగన్ సర్కార్ చేస్తున్న అప్పులపై ప్రాథమిక స్థాయిలో వివరాలు సమర్పించాలని అకౌంటెంట్ జనరల్(ఏజీ)కు కేంద్రం గతంలోనే సంచలన ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ అప్పులకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో అధికారికంగా వెల్లడించిన వైనం సంచలనం రేపుతోంది.
ఏపీలో నానాటికీ అప్పులు పెరిగిపోతున్నాయని, బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లు అని, ప్రస్తుతం ఏపీ అప్పు రూ.3.98 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా వెల్లడించారు. 2017-18లో 9.8 శాతం అప్పులు తగ్గాయని, 2020-21 నాటికి అప్పుల పెరుగుదల 17.1 శాతంగా ఉందని వివరించింది. ఏపీ జీడీపీలోనూ 2014లో అప్పుల శాతం 42.3 శాతం అని, 2015లో 23.3 శాతం అని, 2021కి వచ్చేసరికి అది 36.5 శాతానికి పెరిగాయని చెప్పారు.