ఏపీలో సినిమా టికెట్ల రేట్ల వ్యవహారంపై కొంతకాలంగా తీవ్ర స్థాయిల ో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. టికెట్ రేట్లు పెంచకుంటే సినిమా థియేటర్లు మూసుకోవాల్సిందేనని సినీ వర్గాలు చెప్పడంతో జగన్ కాస్త మెత్తబడ్డట్లు కనిపిస్తోంది. చిరు అండ్ కోతో భేటీ తర్వాత టికెట్ రేట్లలో సవరణలతో పాటు ఐదో షో విషయంలోనూ జగన్ కాస్త తగ్గినట్లు కనిపించింది. ఈ క్రమంలోనే జగన్ తాజాగా ఇండస్ట్రీకి ఊరటనిచ్చేలా మరో నిర్ణయం తీసుకున్నారు.
రేపటి నుంచి ఏపీలో 100 శాతం సీటింగ్ కెపాసిటీతో షోలు వేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతినిచ్చింది. కరోనా మార్గదర్శకాలు, నిబంధనలు పూర్తి కచ్చితత్వంతో అమలు చేయాలని థియేటర్ల యజమానులను ఆదేశించింది. ప్రేక్షకులు మాస్క్ లు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. జగన్ తాజా నిర్ణయంపై టాలీవుడ్ నిర్మాతలు, ధియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా ఒమిక్రాన్ వేరియంట్ దెబ్బకు ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ వంటి పలు సినిమాల విడుదల వాయిదా పడింది. కరోనా కాస్త తగ్గుముఖం పడుతుండడంతో ఈ సినిమాలు ఫిబ్రవరి నెలాఖరులో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు నిర్మాతలు. ఈ సమయంలో థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారంత ఫుల్ జోష్ లో ఉన్నారు. ఫిబ్రవరి 25న పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్, వరుణ్ తేజ్ గని చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. తాజా నిర్ణయంతో పవన్ కు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లయింది.