సీఎం జగన్ ,వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లుగా వైసీపీ నేతల బూతులను సహించిన పవన్ సహనం నశించి…అదే బూతులతో వారిపై పవన్ విరుచుకుపడడం సంచలనంగా మారింది. ఈక్రమంలోనే తాజాగా పవన్ వ్యాఖ్యలకు సీఎం జగన్ స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కొంతమంది టీవీల ముందుకొచ్చి మరీ మూడు పెళ్లిళ్లు చేసుకోమంటున్నారని, చెప్పులు చూపిస్తూ దారుణమైన భాషలో తిడుతున్నారని జగన్ విమర్శించారు.
ఇలాంటి వాళ్లు మన నాయకులా అని విరక్తి కలుగుతోందని, వీధి రౌడీలు కూడా ఈ తరహా భాష మాట్లాడరని జగన్ అన్నారు. ఏపీలో ఒక్కొక్కరూ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మన అక్కాచెల్లెళ్లు, ఆడపడుచులు ఏమైపోతారని జగన్ ప్రశ్నించారు. కొన్నాళ్లు కాపురం చేసి, ఎంతోకొంత డబ్బు ఇచ్చి విడాకులు తీసుకుంటే సమాజంలో మహిళల పరిస్థితి ఏంటని అన్నారు. ఒక్క జగన్ ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉందని జగన్ అన్నారు.
ఇక, రాష్ట్రంలోని భూసమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్ అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను డీనోటిఫై చేసి వాటికి క్లియరెన్స్ ఇస్తున్నామని చెప్పారు. చుక్కల, అనాధీన, నిషేధిత జాబితా 22(1)లోని భూములను డీనోటిఫై చేశామని, ఇకపై ఆ భూములపై యజమానులకు సర్వహక్కులు ఉంటాయని జగన్ తెలిపారు. తమ భూములు అమ్ముకోవచ్చు, బిడ్డల పేరుమీదికి మార్చుకోవచ్చని వివరించారు. అవనిగడ్డలో రైతులకు భూమి పట్టాలు పంచి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.