అమరావతిపై రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అంటే జగన్ తో పాటు వైసిపి నేతలంతా ఒకే పాట పాడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ ఆల్రెడీ సగం పూర్తయిన అమరావతి రాజధానిపై ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అమరావతికి జై కొట్టిన జగన్…ఇప్పుడు సీఎం కాగానే మాట మార్చి మడమ తిప్పడంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు.
గతంలో సీఎం జగన్ అమరావతికి మద్దతు తెలుపుతూ చేసిన వ్యాఖ్యల వీడియోలను కూడా జగన్ అన్న మాటలకు సాక్షాలుగా చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని వ్యవహారంపై వైసీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని కావాలని జగన్ ఏనాడు చెప్పలేదంటూ కరుణాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అమరావతిని జగన్ నూటికి నూరు శాతం సమర్ధించలేదు అని కరుణాకర్ రెడ్డి చెప్పారు.
అమరావతి రాజధాని శంకుస్థాపనకు జగన్ కు ఆహ్వానం అందిందని, కానీ ఆయన దానికి వెళ్లనని చెప్పారని భూమన అన్నారు. రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ నివేదికకు తాను కట్టుబడి ఉంటానని అసెంబ్లీలో కూడా జగన్ చెప్పారని, ఈ విషయం ప్రజలు కూడా మర్చిపోరని అన్నారు. ప్రభుత్వ భూములలో రాజధాని నిర్మాణం సరైన నిర్ణయం కాదని జగన్ అన్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకమని జగన్ శాసనసభ సాక్షిగా ఆనాడు చెప్పారని అన్నారు.
రాయలసీమకు ద్రోహం చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారని, వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని భూమన అన్నారు. ఇలా అమరావతికి జగన్ జై కొట్టలేదని భూమన చేసిన కామెంట్స్ పై ట్రోలింగ్ జరుగుతోంది. అమరావతిపై అతి పెద్ద అబద్ధం ఇదేనంటూ విమర్శిస్తున్నారు.