ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మోసగాళ్లుగా ముద్రపడిన ఏ-1,ఏ-2ల బెయిల్ రద్దు కావడం ఖాయమని షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్, సాయిరెడ్డిల ఆగడాలు, మోసాలు మరింత ఎక్కువయ్యాయని అన్నారు. న్యాయమూర్తులను, న్యాయస్థానాలను కించపరిచేలా సొషల్మీడియాలో పోస్టులు పెట్టిన వారికి విజయసాయి అభయమిచ్చారని ఆరోపించారు. వారిపై విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు….విజయసాయిరెడ్డిని కూడా విచారణ చేయాలని అన్నారు.
న్యాయమూర్తులను దూషించిన వారికి ఏ-1 అభయమిస్తున్నారా? లేదంటే ఇద్దరూ కలిసి అభయమిస్తున్నారా అని ప్రశ్నించారు. వీరిద్దరిలో బిగ్ బాస్ ఎవరని, వివేకా కేసులో విజయసాయిరెడ్డిని విచారణ జరపాలని రఘురామ డిమాండ్ చేశారు. ఇందు భారత్ కంపెనీపై ఏ-2 ఫిర్యాదు చేశారని, రూ.800కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపించారని అన్నారు. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడం వల్లే ఆ సమస్య వచ్చిందని గుర్తు చేశారు.
రాష్ట్రం దివాలా తీయబోతోందని, ఏపీలో ఆర్టికల్ 360 ప్రయోగించి, ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించాలని డిమాండ్ చేశారు. ఏపీలో అభివృద్ధి శూన్యమని, ఏపీలో తిరోగమన పాలన నడుస్తోందని అన్నారు. విశాఖలో కబ్జాల పర్వం పెరిగిందని, అందుకే, ఏపీ నుంచి హైదరాబాద్కు వలసలు పెరిగిపోయాయని అన్నారు. ఏపీలోని పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచి పోతున్నాయని, కొత్తగా పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో జగన్ పాదయాత్ర చేయాలని, అపుడే అక్కడి పరిస్థితులు అర్థమవుతాయని, ఏపీలో శాంతిభద్రతలు లేవని అన్నారు.