సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు 2019 ఎన్నికలకు ముందు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జగన్ సీఎం అయితే కేసు విచారణ వీలైనంత త్వరగా పూర్తవుతుందని, నిందితులకు శిక్ష పడుతుందని టీడీపీ నేతలు సహా అందరూ భావించారు. కానీ, సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టి దాదాపు నాలుగేళ్లు కావస్తున్నా సరే వివేకా కేసు విచారణ ఎక్కడి గొంగళి అన్నట్టుగా ఉంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా వివేకా హత్య నేపథ్యంలో జగనాసుర రక్త చరిత్ర పేరుతో టీడీపీ నేతలు ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతల చేతుల మీదుగా ఈ పుస్తకం విడుదలైంది. వివేకాను హత్య చేసింది ఎవరు అన్న విషయం ప్రజలకు తెలియజేసేందుకే ఈ పుస్తకాన్ని విడుదల చేశామని అచ్చెన్న అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఈ పుస్తకాన్ని అందిస్తామని ఆయన చెప్పారు.
వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి చేసిన జగన్ ను ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అచ్చెన్న జోస్యం చెప్పారు. అధికారం దక్కదన్న భయంతోనే జగన్ ఎన్నో డ్రామాలు ఆడారని విమర్శించారు. కోడి కత్తి డ్రామా, బాబాయ్ హత్య ఇందులో భాగమేనని దుయ్యబట్టారు. వివేకాని చంపినంత క్రూరంగా మరెవరిని చంపి ఉండరని, మూడున్నర గంటలపాటు వివేకాను హింసిస్తూ గొడ్డలితో నరికి చంపినట్లుగా ఆరోపణలు వస్తున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు.
వివేకాది గొడ్డలి పోటు కాదు గుండెపోటు అంటూ విజయ సాయిరెడ్డి అబద్దాలు చెప్పారని, ఈ హత్య చంద్రబాబునాయుడు చేశారని నారాసుర రక్త చరిత్ర అంటూ పుస్తకం కూడా విడుదల చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు పరపతిని దెబ్బ తీసేందుకు కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. సీబీఐ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణ జరుపుతున్నారని అన్నారు. జగన్ భార్య భారతి పీఏని సీబీఐ విచారణ జరిపిన విషయంపై జగన్ పెదవి విప్పలేదని విమర్శించారు.