ఏపీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానంటూ ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చిన జగన్ సీఎం అయిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. 10 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు కొందరు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారని జరిగిన ప్రచారం ఏపీలో కలకలం రేపింది. దీంతో, ఈ వ్యవహారంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని చెప్పిన జగన్ ఇలా వారి ఉద్యోగాలు ఊడగొడుతున్నారని, అటువంటి జగన్ జనం ఎలా నమ్ముతారని లోకేష్ నిలదీశారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులలో కలకలం మొదలైంది. లోకేష్ ఈ విషయంపై ఫోకస్ చేసి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంతో ఈ వ్యవహారంపై వైసీపీ అధిష్టానంలో కలవరం మొదలైంది. ఇప్పటికే ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని సజ్జల ఖండించారు. ఉద్యోగులెవరిని తొలగించడం లేదని, ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అయితే, పంచాయతీ రాజ్ విభాగంలో మాత్రం కొందరు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపునకు కొందరు అధికారులు ఆదేశాలు ఇచ్చారని ఒప్పుకున్నారు.
ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని సజ్జల వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆ ఆదేశాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని జగన్ స్పష్టం చేశారని వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు, అలా తొలగింపునకు ఆదేశాలు ఇచ్చిన వ్యవహారంపై విచారణ కూడా జరుగుతోందని సజ్జల కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా లోకేష్ ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేయడంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.