రాబోయే ఎన్నికలలో వైసీపీ నేతలు 175కు 175 స్థానాలు గెలుస్తామని డప్పు కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, వైసీపీపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమి విజయం నల్లేరు పై నడకే అని టీడీపీ, జనసేన పార్టీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో ఏం చేసినా సరే జగన్ గెలవడంటూ ఐ ప్యాక్ మాజీ అధినేత ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.
2024 ఎన్నికల్లో జగన్ ఘోర ఓటమిని చవిచూడబోతున్నారంటూ పీకే జోస్యం చెప్పారు. ప్రజల సొమ్ము తీసుకుని వాళ్ల బాగోగులు చూస్తున్నామని వారికే ఖర్చు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆ ప్రక్రియ వల్ల జగన్ రాజకీయంగా చాలా నష్టపోతున్నారని పీకే వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కూడా అదే తప్పు చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. పాలన ఎలా ఉంది అనే దాన్నిబట్టే ప్రజలు ఓట్లు వేస్తారని, విద్య, ఉపాధి, అభివృద్ధి, ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు.
ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, టీడీపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. ప్యాలెస్ లో కూర్చుని బటన్ నొక్కితే ఎన్నికల్లో ఓట్లు పడవని ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మరి, ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతల రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.