ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్పై ఉన్న అక్రమాస్తుల కేసులపై విచారణ రోజువారీగా ప్రారంభ మైంది. హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ కేసుల విచారణ సాగుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో రానున్న ఆరు మాసాల్లోనే ఈ కేసుల విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలావుంటే, జగన్పైఉన్న కేసులు, వాటి పరిస్థితి, వాటి తీవ్రత, కేసులు నమోదైన సెక్షన్లు వంటి వాటిని ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అధ్యయనం చేసినట్టు తెలిసింది.
ప్రస్తుతం సీఎం జగన్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతోపాటు.. మనీ ల్యాండరింగ్, అక్రమ పెట్టుబడులు, సూట్ కేస్ కంపెనీల వ్యవహారం, తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేయడం, క్విడ్ ప్రోకో.. వంటి అత్యంత తీవ్రమైన 36 కేసులు ఉన్నాయి. వీటిలో 17 కేసులపైనే ఇప్పుడు విచారణ జరుగుతోంది. మిగిలినవి ఇంకా విచారణ దశలోను, మరికొన్ని చార్జ్షీట్లు కూడా దాఖలు చేయని దశలోనూ ఉన్నాయి. అయితే, ప్రస్తుతం విచారణలో ఉన్న 17 కేసుల్లోనూ మోసం, ఉద్దేశ పూర్వక కుట్రలు, అధికారాన్ని దుర్వినియోగం వంటి తీవ్రమైన నేరాలు ఉన్నాయని ఏడీఆర్ వెల్లడించింది.
ప్రస్తుతం సుప్రీం కోర్టు దేశవ్యాప్తంగా నేర నేతలపై ఉన్న కేసులను వచ్చే ఆరు మాసాల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన దరిమిలా.. మిగిలిన విచారణకు రాని కేసులను పక్కన పెట్టినా.. ప్రస్తుతం విచారణకు నోచుకున్న కేసుల్లో తుది తీర్పులు వెలువడినా.. జగన్కు 10 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉన్నట్లు ఏడీఆర్ తన నివేదికలో పేర్కొనడం సంచలనంగా మారింది. కాగా, ఇదే విషయాన్ని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా ధ్రువీకరించారు.
“ఏడీఆర్.. నివేదిక ప్రకారం సీఎం జగన్ 10 నుంచి 30 ఏళ్ల జైలు శిక్ష పడే కేసుల్లో ఉన్నారు. వీటి విచారణ కూడా త్వరగా పూర్తి చేసేందుకు న్యాయస్థానాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. చూద్దాం. ఏం జరుగుతుందో“ అని పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. జగన్కు జైలు శిక్షలపై ఏడీఆర్ ఇచ్చిన నివేదిక విషయంలో వైసీపీ నాయకులు కూడా తర్జన భర్జన పడుతున్నారు. పైకి మౌనంగానే ఉన్నా.. లోలోన మధన పడుతుండడం గమనార్హం.