మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమా తాజాగా జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 151 కాదు.. రెండు ఒకట్లు పోయి.. కేవలం 5 మాత్రమే మిగులుతుందని అన్నారు. అంతటితో కూడా ఆగకుండా.. పులివెందుల, గుడివాడ నియోజకవర్గాలు కూడా ఈ సారి వైసీపీకి దక్కవని తేల్చి చెప్పారు.
మరి ఆయన ఏ స్ట్రాటజీతో చెప్పారో తెలియదు కానీ… మొత్తానికి చెప్పేశారు. పోనీ.. ఆయన చెప్పినట్టు జరగాలంటే.. టీడీపీకి బలం ఎంత ఉందనేది ఇప్పుడు ప్రశ్న.
ఒకవైపు.. పార్టీ అధినేత చంద్రబాబు మాటను పట్టించుకునే నాధుడు కనిపించడం లేదని.. అనుకూల మీడియాల్లోకూడా కథనాలు వస్తున్నాయి. కంచుకోటల్లోనూ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు వెక్కిరిస్తున్నాయి. పోనీ ఇప్పటికైనా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పుంజుకుందా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. కనీసం.. నాయకులు అయినా.. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారా? అంటే.. అది కూడా లేదని నాలుగు రోజుల కిందట చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.
పని చేసేవారికే టికెట్లు ఇస్తామని చంద్రబాబు పదే పదే చెబుతున్నారంటే.. ఎంత మంది పనిచేస్తున్నా రనే ప్రశ్న.. వెంటనే వస్తుంది కదా!అందరూ పనిచేస్తుంటే.. అందరూ దూకుడుగా ఉంటే.. పార్టీ అధినేత ఇలా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఏముంటుంది. ముఖ్యంగా ఉమా వంటివారి పరిస్థితే అగమ్యగోచరంగా ఉందనినివేదికలు చెబుతున్నాయి. ఆయనపై గత ఎన్నికలకు ముందు వచ్చిన ఆగ్రహం ఇప్పటికీ కమ్మ వర్గంలో చల్లారలేదు.
కనీసం.. దీనిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కూడా ఆయన చేయడం లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో పార్టీ గుండుగుత్తుగా.. 170 స్థానాల్లో ఎలా ఎగబాకుతుందని దేవినేని అంచనా వేస్తున్నారో.. ఇలాంటి జోస్యాలు ఎలాచెబుతున్నారో.. ఆయనకే తెలియాలని అంటున్నారు టీడీపీ నాయకులు. మొత్తానికి ఇలాంటి ప్రకటనలు ఆపు చేసి.. తక్షణం కార్యరంగంలోకి దూకాల్సిననాయకులు ప్రకటనలకే పరిమితం కావడం.. పార్టీ భవిష్యత్తుకు ప్రమాదకరమని అంటున్నారు.