అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఈ విషయం రాజకీయ నాయకుల కంటే ఐఏఎస్ అధికారులకే ఎక్కువ తెలుసు. రాజకీయ బాస్‌ల మనసెరిగి వ్యవహరిస్తూనే.. పరిధి దాటకుండా చూసుకుంటుంటారు. అయితే సీఎం జగన్మోహన్రెడ్డి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ ఆ విషయం విస్మరించి వ్యవహరించారు.
సాధారణంగానే ఆయన ఒకరి మాట వినరు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తారని ప్రచారం కూడా ఉంది. ఈ విషయంలో జగన్‌కు, ఆయనకు పోలిక సరిపోతుందనీ అంటారు. జగనే ప్రవీణ్.. ప్రవీణే సీఎం అన్నట్లుగా నిన్నమొన్నటివరకు నడచింది.
సాధారణంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులెవరికీ ఇతర శాఖల బాధ్యతలు ఇవ్వరు. కానీ ప్రవీణ్.. సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి పదవితో పాటు కీలకమైన సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ-పొలిటికల్) ముఖ్య కార్యదర్శిగానూ బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారాలను సైతం చేజిక్కించుకుని.. ఆయన/ఆమెకు చెప్పకుండానే జీవోలు జారీచేసేవారు.
ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎ్‌సగా ఉన్నప్పుడు ఇలా కొన్ని రకాల ఉత్తర్వులు జారీచేయడానికి అంగీకరించలేదు. దీంతో సీఎస్ జారీచేయాల్సిన ఆదేశాలను సీఎం అనుమతితో జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ఇవ్వొచ్చంటూ ప్రవీణ్‌ప్రకాశ్ తానే ఒక జీవో జారీచేశారు. దీనిపై ఎల్వీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేశారు. తన సన్నిహితుడైన అధికారికి నోటీసు ఇవ్వడంపై జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆయన్ను అవమానకర రీతిలో సాగనంపారు. కనీసం అటెండర్ గానీ, ఫ్యాన్ గానీ లేని బాపట్ల మానవ వనరుల అభివృద్ధి కార్యాలయం డైరెక్టర్ జనరల్‌గా బదిలీచేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో తనకెంతగానో సహకరించినప్పటికీ ఎల్వీకి జగన్ ఆ గతి పట్టించారు. నాటి నుంచి అధికార యంత్రాంగంలో ప్రవీణ్ ప్రకాశ్ అంటే తిరుగులేకుండా పోయింది.
ఎల్వీ తర్వాత సీఎస్‌గా వచ్చిన నీలం సాహ్ని.. ఆయన మాటకు ఎదురుచెప్పలేదు. ప్రవీణ్ ఒంటెత్తుపోకడ, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడం వల్లే ఆమె పలుసార్లు హైకోర్టు ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చిందని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం ఉంది. చంద్రబాబు హయాంలో ప్రవీణ్ ఢిల్లీలోని ఏపీభవన్‌లో రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేశారు.
జగన్ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి వచ్చేశారు. సీఎం కార్యాలయం, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా జోడుపదవులు చేపట్టారు. రెసిడెంట్ కమిషనర్‌గా దీర్ఘకాలం ఢిల్లీలో ఉన్నందున.. అక్కడి వ్యవహారాలు ఆయనకు తెలిసినందున.. కేంద్ర పెద్దలకు చేరువయ్యేందుకు ఆయన తోడ్పడతారని ప్రభుత్వ పెద్దలు భావించారు. దానికి తగినట్లుగానే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు తీసుకోవడంలో ప్రవీణ్ కీలక పాత్ర పోషించేవారు. అలాగే పరిపాలనా రాజధానిగా విశాఖను తయారుచేసే బాధ్యతనూ ఆయనే తీసుకున్నారు.
గతంలో అక్కడ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో.. సీఎం కార్యాలయం, నివాసం, సచివాలయం, రాజ్‌భవన్, శాఖాధిపతుల కార్యాలయాలకు భవనాల కోసం విశాఖ మొత్తం ఆయన జల్లెడపట్టారు. ప్రతి శని, ఆదివారాల్లో అక్కడే ఉండి.. రాజధాని సన్నాహాలను సమీక్షించేవారు. ప్రవీణ్ సమ్మతి లేనిదే సచివాలయంలో ఒక్క ఫైలు కూడా కదలదు.
తన కంటే సీనియర్లను లెక్కచేయరని.. సహచరులను, కింది స్థాయి అధికారులను వేధిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. అలాంటి ప్రవీణ్ అధికారాలకు ఇప్పుడు జగన్ ఆకస్మికంగా కత్తెరవేశారు. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా తొలగించారు. తన ముఖ్య కార్యదర్శిగా కొనసాగించాలని మాత్రం నిర్ణయించారు.
సీఎస్ దాస్‌తో ఢీకొట్టి..
గత కొంతకాలంగా తానే సీఎం, తానే సీఎస్ అన్న రీతిలో ప్రవీణ్ వ్యవహరిస్తున్నట్లు ఐఏఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. సీఎం కనుసన్నల్లో నడుస్తూ ఇతర అధికారులను తీవ్రస్థాయిలో వేధిస్తుండడం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు ఆగ్రహం తెప్పించింది.
ఆయన వ్యవహార శైలి ఆయనకు ఏ మాత్రం నచ్చలేదు. కీలక అధికారుల నియామకం విషయంలో ప్రవీణ్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రిని సైతం తప్పుదారి పట్టించారని పలువురు అధికారులు ఫిర్యాదులు కూడా చేశారు. నిబంధనలు అనుసరించకుండా దూకుడుగా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల సమస్యలొస్తాయని దాస్ కొన్ని సందర్భాల్లో సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
అలాగే, కొన్ని కీలక నిర్ణయాల విషయంలో ప్రవీణ్ అనుసరించిన పద్ధతి, తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయని ఉన్నతాధికారులు తేల్చారు. కోర్టుల్లో ప్రతిసారీ ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతున్న వైనంపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగినప్పుడు ప్రవీణ్ ప్రకాశ్ అసంబద్ధ నిర్ణయాలను కొందరు అధికారులలు వేలెత్తి చూపినట్లు తెలిసింది.
దీంతో ఆయన అధికారాలకు కత్తెర వేయాల్సిందేనని, సీఎం పేషీకి మాత్రమే పరిమితం చేసి సాధారణ పరిపాలన శాఖ తప్పించాలని సీఎస్ పట్టుబట్టారని.. ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేయక తప్పలేదని ఐఏఎస్ వర్గాలు అంటున్నాయి. సీఎం పేషీలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న రేవు ముత్యాలరాజుకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
అధికారిపై కోపంతో శాఖలే బదిలీ
ప్రభుత్వానికి ఎవరైనా అధికారిపై కోపమొస్తే.. ఆ శాఖ నుంచి ఇంకో శాఖకు బదిలీ చేస్తారు. కానీ ప్రవీణ్ ప్రకాశ్ ఒక సీనియర్ అధికారిపై కోపంతో ఆయన చూస్తున్న శాఖలను మరో శాఖకు బదిలీ చేశారు. సీఎస్ దాస్‌కు కూడా తెలియకుండా, ఆయన పేరిటే ఉత్తర్వులు ఇవ్వడం మరో వింత. రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి ఘటనలు జరగలేదని ఐఏఎస్ వర్గాలు చెబుతున్నాయి.
సచివాలయ స్థాయిలో రెవెన్యూ శాఖను పర్యవేక్షించే అధికారి నుంచి ఇటీవల వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖలను తొలగించి.. వాటిని ఆర్థిక శాఖ పరిధిలోకి తెస్తూ సీఎస్ పేరుతో జీఏడీ పొలిటికల్ ముఖ్య కార్యదర్శి హోదాలో ప్రవీణ్ జీవో జారీ చేశారు. ఇవి రెండూ ‘ఆదాయార్జన’ విభాగాలు కాబట్టి ఆర్థిక శాఖ పరిధిలోకి తెస్తున్నామని సమర్థించుకున్నారు. అసలు విషయం ఏమిటంటే.. అప్పటిదాకా ఆ రెండు శాఖలను చూస్తున్న అధికారి అంటే గిట్టనందునే ప్రవీణ్ ఈ ఎత్తుగడ వేసినట్లు చర్చ జరుగుతోంది.
ఇలా ఒక్క జీవోతో ఉన్నపళంగా శాఖలను తీసేయడం సీనియర్లను అవమానించడమేనని తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఒక్క అధికారిపై కోపమొస్తే పాలనాపరంగా ఇంత గందరగోళం సృష్టిస్తారా అంటూ అధికారులు మండిపడ్డారు.
కేంద్ర సర్వీసులకు వెళ్లాలని..
తనకు ఎదురుదెబ్బలు తగులుతాయని ప్రవీణ్ ముందుగానే గ్రహించినట్లు తెలుస్తోది. అందుకే కేంద్ర సర్వీసులకు వెళ్లాలని భావించారు. గతంలో కూడా ఆయన కేంద్ర సర్వీసుల్లో పనిచేసి.. తిరిగి రాష్ట్రానికి వచ్చారు. ఎవరైనా కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు.. కేంద్ర సిబ్బంది-శిక్షణ శాఖ సదరు రాష్ట్రంలోని ఐదుగురు సీనియర్ అధికారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుంది. ప్రతికూల నివేదిక వస్తే కేంద్రంలోకి తీసుకోదు.
మరోసారి దరఖాస్తు చేస్తే.. ఈసారి 15 మంది ఐఏఎస్‌ల నుంచి సమాచారం సేకరిస్తుంది. వీరిలో సీనియర్లు, జూనియర్లు, రిటైరైనవారూ ఉండొచ్చు. వీరిలో మెజారిటీ అధికారులు ఏం చెబితే దానికి అనుగుణంగా వ్యవహరిస్తుంది. ప్రవీణ్ దరఖాస్తుపైనా ఫీడ్‌బ్యాక్ తీసుకుంది. ఐదుగురు సీనియర్లలో ఒక్కరు కూడా ప్రవీణ్‌పై సానుకూల నివేదిక ఇవ్వలేదని తేలింది.
తన నిరంకుశ నడవడితో రాష్ట్రంలోని అధికారులందరినీ దూరం చేసుకున్నందున మళ్లీ దరఖాస్తు చేసినా ప్రయోజనం ఉండదని ఆయనకు అర్థమైందని.. అందుకే కేంద్ర సర్వీసులకు వెళ్లే ఆలోచన విరమించుకున్నారని అంటున్నారు. అయితే రాష్ట్ర సర్వీసులోనే ఉంటూ తిరిగి ఢిల్లీ ఏపీ భవన్‌కు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.