తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరిగా పేరున్న కొమ్మారెడ్డి పట్టాభి తాజాగా వార్తల్లోకి వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జగన్ ఇంటి చుట్టు కట్టిన ఇనుప కంచె కోసం రూ.12.85 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు.
రాష్ట్రపతి భవన్ కు.. ప్రధానమంత్రి నివాసం ఉండే భవనాలకు సైతం ఈ స్థాయిలో కంచె ఏర్పాట్లు లేవన్న ఆయన.. ‘‘రుషికొండ ప్యాలెస్ లోని బాత్ టబ్ లు.. కప్ బోర్డులు..మసాజ్ టేబుళ్లు.. తాడేపల్లి ప్యాలెస్ లే ఆయన విలాసాలకు నిదర్శనం. జగన్ ఇంటి చుట్టూ నిర్మించుకున్న ఇనుప కంచెకకు రూ.12.85 కోట్లు ఖర్చు చేశారు. ఈ విషయాన్ని సాధారణ పరిపాలన విభాగం తెలిపింది’’ అని పేర్కొన్నారు.
తాడేపల్లిలోని జగన్ ఇంటి దక్షిణం వైపు 0.148 ఎకరాల స్థలంలో వ్యూకట్టర్ నిర్మాణానికి రూ.3.25 కోట్లు.. జగన్ ఇంటి భద్రతా ఏర్పాట్లకే రూ.16.10 కోట్ల ప్రజాధనాన్నిఖర్చు చేశారన్నారు. జగన్ తాను ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో విలాసాల పేరుతో రూ.5వేల కోట్లకు పైగా దుర్వినియోగం చేశారని.. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులకు రూ.3వేల కోట్లు ఖర్చు చేశారన్నారు.
ఇక.. సర్వే రాళ్లపై బొమ్మలకు రూ.700 కోట్లు.. రుషికొండ ప్యాలెస్ కు రూ.600 కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రకటనల పేరుతో సాక్షిపత్రికకు రూ.500 కోట్లు పాస్ పుస్తకాలపై బొమ్మలకురూ.13 కోట్లు.. తాడేపల్లి ప్యాలెస్ ఖర్చులకు రూ.15 కోట్లు ఖర్చు చేసిన ఘనత జగన్ దని పేర్కొన్నారు. ఐదేళ్లు జనం సొమ్ము కాజేసి.. తాడేపల్లి ప్యాలెస్ లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు పోగేసుకున్న జగన్.. చివరకు ఇంటి చుట్టూ కంచె వేసుకునేందుకు రూ.13 కోట్ల ప్రజాధానాన్ని ఖర్చు చేయటం ఏమిటి? అని ప్రశ్నించారు. ఆయన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.