ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం విషయంలో జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విద్యార్థి లోకంతో పాటు టీడీపీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతోపాటు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చి మరీ తమ నిరసన తెలిపారు. ఇక, ఈ నిరసనల క్రమంలోనే అనంతపురంలో విద్యార్థిని జయలక్ష్మి తలకు గాయం అయిన ఘటన పెను దుమారం రేపింది. ఈ ఘటనతో జగన్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై జగన్ వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. టీడీపీ, విద్యార్థులు,తల్లిదండ్రులు పెట్టిన ఒత్తిడికి జగన్ తలొగ్గారు. గతంలో విలీనంపై 2 ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం…ఇప్పుడు 4 ఆప్షన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు ఎయిడెడ్గా కొనసాగేందుకు కొత్తగా అవకాశం కల్పిస్తూ మూడో ఆప్షన్ ఇచ్చింది. ఈ ఆప్షన్ ప్రకారం విలీనానికి ముందు మాదిరిగానే ఎయిడెడ్ కళాశాలలు కొనసాగించుకోవచ్చు.
ప్రభుత్వంలో విలీనానికి సమ్మతిస్తూ లేఖలు ఇచ్చిన సంస్థలు కూడా మళ్లీ ఆ లేఖలు వెనక్కి తీసుకుని ఎయిడెడ్ కళాశాలలుగా కొనసాగే అవకాశమిస్తూ నాలుగో ఆప్షన్ జారీ చేసింది. ఈ ప్రకారం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ నాలుగు ఆప్షన్లు ఇవే:
1)ఎయిడెడ్ విద్యాసంస్థలు తమ ఆస్తులతో సహా ప్రభుత్వంలో విలీనం కావాలి. ఇందుకోసం ఆ సంస్థలకు ఉన్న భవనాలు, భూములు, సిబ్బంది సహా ప్రభుత్వంలో విలీనం కావాలి.
2) ఆస్తులను వదులుకోని పక్షంలో బోధనా సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించాలి. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఉన్న ఉపాధ్యాయులు/లెక్చరర్లను ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆ తర్వాత ఎయిడెడ్ విద్యాసంస్థలు కొత్తవారిని నియమించుకుని ప్రైవేటు విద్యాసంస్థలుగా మారొచ్చు.
3) మొదటి రెండు ఆప్షన్లు నచ్చకుంటే ఎప్పటిలానే ఎయిడెడ్ విద్యాసంస్థలానే కొనసాగవచ్చు. విలీనం ఇష్టం లేదని ప్రభుత్వానికి లేఖలు ఇవ్వొచ్చు.
4) గతంలో లేఖలు ఇచ్చిన ఎయిడెడ్ విద్యాసంస్థలు కూడా తమ అభిప్రాయాన్ని తాజాగా తెలుపుతూ లేఖలు ఇవ్వవచ్చు. ఈ నాలుగు ఆప్షన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు.