ఎన్నికల ఫలితాలు వెలువడి.. అఖండ మెజారిటీతో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి మూడో నెల నడుస్తోంది. అయినా జగన్ ప్రభుత్వంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు ఇప్పటికీ కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. తాము చేసిన అక్రమాల ఆనవాళ్లు కనిపించకుండా ఆధారాలను మాయం చేస్తున్నారు. ఏకంగా ఫైళ్లనే తగులబెడుతున్నారు. ఇలాంటి అకృత్యాలను మున్నెన్నడూ ఏ రాష్ట్రంలోనూ చూడలేదు.
మరి అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఏం చేస్తున్నట్లు? కళ్ల ముందు దారుణాలు జరుగుతున్నా ఎందుకు చోద్యం చూస్తున్నారు? ఆధారాలన్నీ ధ్వంసం చేశాక అక్రమాలు బయటపెట్టడం సాధ్యమేనా? శాఖల్లో పాతుకుపోయిన అవినీతి అధికారులను కదల్చకుండా నిజాలను ఎలా వెలికితీస్తారు? జగన్ ప్రభుత్వంలో పాలకులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు.
అవినీతికి ఆస్కారమున్న ప్రతిచోటా కోట్లకు కోట్లు దోచేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో.. నాటి అక్రమాలు, అవినీతి, అరాచకాలు బయటపడకుండా వైసీపీ పెద్దల వీరభక్త అధికారులు నిజాలకు నిప్పుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలా శాఖల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులను మార్చకపోవడమే ఈ పరిస్థితికి కారణం.
జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాల సరళి మొదలైన రెండు గంటల వ్యవధిలోనే కొందరు అధికారులు కీలకమైన ఫైళ్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు గుట్టుగా తరలించుకుపోయారు. ఎక్సైజ్, గనులు, సీఐడీ విభాగాల్లో కీలక ఫైళ్లను దహనం చేశారు. మరికొందరు కూటమి ప్రభుత్వం కొలువుదీరడానికి ముందు కూడా అడ్డగోలు అనుమతులు ఇస్తూ ఫైళ్లను సెటిల్ చేశారు. వాటికి సంబంధించిన నోట్‌ఫైళ్లను ఎత్తుకుపోయారు. ప్రభుత్వం మారిన వెంటనే ఈ-ఆఫీసు లాగిన్ వివరాలను బ్లాక్ చేయకపోవడంతో కీలకమైన ఫైళ్లకు సంబంధించిన నోట్‌ఫైల్స్‌ను సర్వర్ల నుంచి తొలగించారు.
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) చైర్మన్‌గా ఉన్న మాజీ సీఎస్ సమీర్‌శర్మ తన కార్యాలయంలోని కీలకమైన ఫైళ్లను బయటకు తీసుకెళ్లి తగులబెట్టించే ప్రయత్నం చేశారు. దీనివెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా కొత్త ప్రభుత్వం జగన్ వీరభక్త అధికారులపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఎన్నికల ఫలితాల రోజే…
జగన్ అక్రమాలకు వంతపాడిన అధికారుల్లో నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి ఒకరు. మద్యం పాలసీల పేరిట జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. రెగ్యులర్ మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో లేకుండా చేసి జగ న్కు కప్పం కట్టే అనుకూల బ్రాండ్లు మాత్రమే వ్యాపారం చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాల సరళిని చూసి అప్పటికప్పుడు జాగ్రత్తపడ్డారు.
తన కార్యాలయంలోని కీలకమైన ఫైళ్లను రెండు దఫాలుగా వాహనాల్లో తరలించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంపై ఆయనపై పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. ఫిర్యాదు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం అప్రమత్తం కాలేదు. ఫిజికల్ ఫైళ్లను తరలించినా, ఆన్లైన్లో ఫైళ్లు ఉంటాయి. ఆన్లైన్లోని నోట్‌ఫైళ్లను కూడా తొలగించే అవకాశం ఉందని జాగ్రత్తపడి జగన్ భక్త అధికారుల ఈ-ఆఫీసు లాగిన్స్‌ను బ్లాక్ చేయలేదు. దీంతో మద్యం వ్యవహారాలకు సంబంధించిన కీలకమైన నోట్‌ఫైల్స్‌ను ఈ-ఆఫీసు సర్వర్ నుంచి తొలగించినట్లు ఆ తర్వాత గుర్తించారు.
ప్రభుత్వం నింపాదిగా స్పందించి వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు చేయించింది. కానీ అప్పటికే కీలక ఫైౖళ్లు మాయం అయ్యాయి. ఎక్సైజ్ శాఖలో ఏయే ఫైళ్లు ఉన్నాయి? ఏవేవి మాయమయ్యాయి? వాసుదేవరెడ్డి చేసిన ఘనకార్యాలు ఏమిటి? వంటివాటిని నిగ్గుతేల్చేందుకు ఇతమిద్దమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించలేదు. సీఐడీ స్వీయ విచారణ తప్ప శాఖాపరమైన విచారణేది జరగడం లేదు. దీంతో అక్రమార్కులు బహిరంగంగా తిరుగుతున్నారు. ప్రభుత్వం మద్యం వ్యవహారాలపై విచారణకు ఆదేశించే నాటికే కీలకమైన ఆధారాలను తొలగించే పనిలో ఉన్నారు.
గనుల్లో ఇష్టారాజ్యం
జగన్ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాల్లో భారీ అవినీతి జరిగింది. జేపీ వెంచర్స్‌కు రెండేళ్ల కాంట్రాక్టు ఇచ్చినా వైసీపీ నేతలే దందా చేశారు. గనుల శాఖలో ఇసుక అమ్మకం టెండర్లతో పాటు బొగ్గు తవ్వకం, వేలం టెండర్లు, బీచ్‌శాండ్, క్వార్ట్జ్, మైనర్ మినరల్స్ లీజులు, వేలం పాటలు, వాటి రె న్యువల్కు ఇచ్చే లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ)లు, అధిక ధరలకు సర్వేరాళ్ల కొనుగోలు, సర్వేరాళ్ల ఎంగ్రేవింగ్ యూనిట్ల వ్యవహారాల్లో వేల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఓట్ల లెక్కింపు మరుసటి రోజున అంటే… జూన్ 5వ తేదీన గనుల శాఖ ఉన్నతాధికారి తాటిగడపలోని ఏపీఎండీసీ, ఇబ్రహీంపట్నంలోని గనుల డైరెక్టరేట్ పరిధిలోని అత్యంత కీలకమైన ఫైళ్లను తన సహాయకుడి ద్వారా రెండు వాహనాల్లో బయటకు తరలించి తగలబెట్టించారనే ఫిర్యాదులున్నాయి. రెండు బస్తాల నిండా ఫైళ్లు తీసుకె ళ్లి అగ్గిలో కాల్చడం సహ ఉద్యోగులు సైతం చూశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దర్జాగా 180 లీజుల రెన్యువల్, మరో 120 లీజులకు కొత్తగా అనుమతులు ఇస్తూ ఎల్ఓఐలు జారీ చేశారు. వాటికి సంబంధించిన నోట్‌ఫైల్స్‌ను తొలగించారు.
ఎన్నికల ఫలితాలు రావ డానికి ముందు జేపీ వెంచర్స్‌కు 120 కోట్ల బ్యాంక్ గ్యారెంటీలు చెల్లించారు. వాటికి సంబంధించిన నోట్‌ఫైల్స్‌ను మాయం చేశారని తాజాగా గుర్తించారు. మాంగనీస్ టెండర్లలో కాంట్రాక్టర్ సమర్పించిన సెక్యూరిటీ డిపాజిట్‌ను ఔట్సోర్సింగ్ సిబ్బంది సహకారంతో ఉన్నతాధికారులు దారి మళ్లించారు. దీనికి సంబంధించిన ఫైళ్లు, ఇతర సమాచారం ఆఫీసు ఫైళ్లనుంచి గుట్టుగా తొలగించారు.
గుట్టంతా పీసీబీలోనే…
కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చైర్మన్‌గా మాజీ సీఎస్ సమీర్‌శర్మ పనిచేశారు. జగన్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. గత ఐదేళ్లు పీసీబీ అడ్డగోలుగా వ్యవహరించింది. ఇసుక రీచ్‌లు, బెరైటీస్, క్వార్ట్జ్, బీచ్‌శాండ్ సహా మైనర్ మినరల్స్ తవ్వకాలకు కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్(సీటీఈ), కన్సెంట్ ఆఫ్ ఆపరేషన్ (సీటీఓ)లు పీసీబీనే ఇవ్వాలి. పర్యావరణ అనుమతులు, సీటీఈ, సీటీఓలు లేకున్నా ఇసుక తవ్వకాలు జరిగాయి. కలెక్టర్లు, పీసీబీ అధికారులు అనేక దఫాలుగా సమీర్‌శర్మకు లేఖలు రాశారు.
కేంద్రం నుంచి కూడా అనేక రిమైండర్లు, సూచనలతో కూడిన ఉత్తర్వులు వచ్చాయి. అయినా చర్యలు తీసుకోలేదు. రుషికొండపై జగన్ సర్కారు నిర్మించిన ప్యాలెస్‌కు సంబంధించి హైకోర్టు, సుప్రీం కోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసులు నడిచాయు. అడ్డగోలు అక్రమ నిర్మాణాలకు పీసీబీ వంతపాడింది. రాష్ట్రంలోని పలు పరిశ్రమలపై అనేక ఫిర్యాదులు వచ్చినా పీసీబీ పట్టించుకోలేదు. కానీ గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్‌పై వచ్చిన ఫిర్యాదులపై ఆగమేఘాల మీద స్పందించి పీసీబీ అధికారులు దాడులు చేశారు. ఆ సంస్థను వేధించడమే లక్ష్యంగా పనిచేశారు.
పీసీబీలో కీలకమైన ఫైళ్లు ఉన్నాయి. జగన్ పభుత్వాన్ని ఇరకాటంలో పడేసే కీలకమైన ఫైళ్లు, నివే దికలు, హార్డ్ డిస్క్‌లను గుట్టుగా తరలించి తగుల బెట్టించారని సమీర్‌శర్మపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
మదనపల్లె ఫైల్స్..
చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని ఏడు నియోజకవర్గాల పరిధిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆయన తమ్ముడు, తంబళ్లపల్లె వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, వారి అనుచరులు పెద్దఎత్తున భూదందాలకు పాల్పడ్డారు. పేద, మధ్యతరగతి ప్రజలను బెదిరించి దరిదాపుగా వెయ్యి ఎకరాల అసైన్డ్, ఫ్రీ హోల్డ్ భూములను బెదిరించి లాక్కున్నారు. వాటిని 22ఏ నుంచి తొలగింపజేసి అక్రమంగా రిజిసే్ట్రషన్ చేయించుకున్నారు. అవి ఎవరెవరి భూములో మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లలో ఉన్నాయి. ఆ వివరాలు బయటకు పొక్కకుండా రాత్రికి రాత్రి ఉద్యోగుల సాయంతో ఆఫీసుకే నిప్పుబెట్టారు. 22ఏ విభాగంలోనే ఇది జరిగింది. పెద్దిరెడ్డి అనుచరుల అండతోనే ఈ ఘటన జరిగినట్లు తేలింది. సీఐడీ పెద్దిరెడ్డి అండ్ కోకు ఉచ్చుబిగిస్తోంది.
పోలవరం ఫైళ్లకు నిప్పు!
పోలవరం ప్రాజెక్టు ఫైళ్లు కూడా రాత్రికి రాత్రి తగలబడిపోయాయి. కొత్త బీరువాలు కొని పాతవన్నీ క్లీన చేస్తూ వేస్ట్ పేపర్లను దహనం చేసినట్టు అధికారులు చెబుతున్నా, ఇది మరో మదనపల్లె ఘటనేనన్న అనుమానాలు కమ్ముకుంటున్నాయి. పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనుల కోసం చేపట్టిన భూసేకరణ చెల్లింపుల్లో భారీ స్కాం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం రూ.19 కోట్లు దాకా మింగేశారని చెబుతున్నారు.
ఇప్పుడు తగలబడింది సరిగ్గా ఆ ప్రధాన ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయంలోని ఫైళ్లే! ఇంకా.. రైతులు, లబ్ధిదారుల ఆధార్ కార్డులు, కాకినాడ కలెక్టరేట్ నుంచి ఇక్కడకు వచ్చిన లెటర్లు, పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించిన అవార్డు పత్రాలు, ఫొటోలు కూడా దహనమైన వాటిలో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు అమలుచేసే కార్యాలయం ధవళేశ్వరంలో ఉంది. ఇక్కడ ప్రాజెక్టు అడ్మిస్ర్టేటర్గా ఐఏఎస్ అధికారి, భూసేకరణ స్పెషల్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ప్రధాన కాలువ భూసేకరణ విభాగం) ఉన్నారు.
పోలవరం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి మీదుగా విశాఖపట్నానికి నీటిని తీసుకెళ్లడానికి పోలవరం ప్రాజెక్టు నుంచి 212 కిలోమీటర్ల మేర ఎడమ ప్రధాన కాలువను నిర్మిస్తున్నారు. ఇందులో చాలా వరకూ భూసేకరణ జరిగింది. దానికి సంబంధించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలుకు సంబంధించిన ఫైళ్లు, ఎవరి భూమిని ఎంతకు, ఎపుడు సేకరించామనే ఫైళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. గతంలో స్పెషల్ కలెక్టర్‌గా పనిచేసిన వి.మురళి దేవీపట్నం తదితర ప్రాంతాల్లో లబ్ధిదార్లకు దక్కకుండా రూ.19 కోట్లు కాజేశారు.
ఆ తర్వాత 22మంది నకిలీ రైతులను సృష్టించి రూ.6 కోట్లు కాజేసిన గొడవలు, కేసులు కూడా ఉన్నాయి. రూ.6 కోట్ల కేసు కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏమైనా ప్రణాళిక ప్రకారమే నిప్పుపెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ధవళేశ్వరంలోని భూసేకరణ కార్యాలయంలో ప్రస్తుతం ప్రాజెక్టు పరిపాలనాధికారిగా ఉన్న ఐఏఎస్ అధికారి ఇలాక్కియా కొద్దివారాల క్రితమే బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల ఆమె ఆరునెలల మెటర్నిటీ లీవ్ మీద వెళ్లారు. భూసేకరణ స్పెషల్ కలెక్టర్ ఎస్.సరళాదేవి కూడా ప్రస్తుతం సెలవులో ఉన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి.మమ్మి కూడా రెండురోజుల పాటు సెలవు పెట్టారు.
ఈలోపు ఆఫీసు ఇనచార్జిగా స్పెషల్ కలెక్టర్ పీఏ వేదవల్లిని నియమించారు. ఆఫీసు సూపరింటెండెంట్‌గా కుమారి అనే ఉద్యోగిని ఉన్నారు. ఇక్కడ పనిచేసే శ్రావణి అనే స్వీపర్ శుక్రవారం రాత్రి బీరువా సర్ది, శుభ్రం చేసి, పలు ఫైళ్లను, పత్రాలను బయట పడేసినట్టు చెబుతున్నారు. ఆమె వాటిని దహనం చేసినట్టు ఒకసారి, సిబ్బందే తగలబెట్టారని మరోసారి చెబుతున్నారు. ఈ సమాచారం బయటకు పొక్కేసరికే కొన్ని ఫైళ్లు పూర్తిగా దహనమై, బూడిదగా మారగా, కొన్ని సగం వరకూ కాలి ఉన్నాయి.
అవి వేస్ట్ ఫైళ్లు ఎందుకవుతాయి?
సమాచారం తెలిసి, విలేకరులు వెళ్లి చూస్తుండగా, ఆఫీసు లోపల ఉన్న వేదవల్లి, కుమారి తమ సిబ్బందితో సగం వరకూ తగలబడిన ఫైళ్ళను లోపలకు తెప్పించి, భద్రపరిచారు. ఇవి కేవలం చిత్తు కాగితాలని, ఆఫీసును శుభ్రం చేస్తూ, వేస్ట్‌గా ఉన్నవాటికి నిప్పు పెట్టినట్టు కుమారి తెలిపారు. ఈ క్రమంలో విలేకరులు కొన్ని పత్రాలు చూపించి, ఇవి వేస్ట్ ఫైళ్లు ఎందుకవుతాయి? అధికార్ల సంతకాలు కూడా ఉన్నాయి కదా? అని ప్రశ్నించగా… ఇనచార్జి వేదవల్లి జోక్యం చేసుకున్నారు.
‘వేస్ట్ కాగితాలైతే మాత్రం నాకు చెప్పకుండా ఎందుకు ఇలా చేయించావ’ని కుమారిపై ఆగ్రహించారు. ‘నేను కొద్ది నెలల్లో ఉద్యోగ విరమణ చేస్తా, నాకు పెద్ద సమస్య తెచ్చిపెట్టావ’ని చీవాట్లు వేశారు. ఆ తర్వాత తాను కలెక్టర్ ఆఫీసుకు వెళుతున్నట్టు చెప్పి ఆమె వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతోపాటు నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరు అధికార్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అసలు సూత్రధారులు ఎవరో బయటకకు తీసుకొచ్చే ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదు.
అమిగోస్ ఆటకట్టు!
జగన్ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అనంతపురం జిల్లాలో ఖనిజ సంపదను దోచుకున్న అమిగోస్ మినరల్స్ ప్రైవేటు సంస్థ, ప్రభుత్వం మారగానే కీలక ఫైళ్లు దాచేసే ప్రయత్నంలో పడింది. అనంతపురం నగరంలోని తమ కార్యాలయంలో నుంచి ముఖ్యమైన డేటాను మాయం చేయాలని చూస్తోంది. ఫైళ్లను కార్యాలయం నుంచి తరలించేందుకు ప్రయత్నించగా, మైన్స అధికారులు అడ్డుకున్నారు. తిరుపతికి చెందిన అమిగోస్ సంస్థ ఎండీ ప్రసాద్ రెడ్డి….మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు, వైసీపీ అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గ ఇనచార్జి.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా మైనింగ్ కంపెనీలుఉన్నాయి. ఆ కంపెనీల రాయల్టీలు వసూలు చేసి ఏటా ప్రభుత్వానికి రూ. 260 కోట్లు వసూలు చేసి పెట్టే కాంట్రాక్టును అమిగోస్‌కు జగన్ సర్కారు కట్టబెట్టింది. అయితే, 72 చెక్‌పోస్టులు పెట్టి పరిమితికిమించి పన్నుల వసూళ్ల ద్వారా అమిగోస్ ప్రతినిధులు గత ప్రభుత్వం కోట్లు వెనుకేసుకున్నారు. ప్రభుత్వం మారగానే ఇప్పుడు చల్లగా సర్దుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే అమిగోస్ సంస్థ ఎండీ ప్రసాదరెడ్డి, ముఖ్య అధికారులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. ప్రసాద్‌రెడ్డి తమకు అందుబాటులోకి రావడం లేదని మైనింగ్ శాఖ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అమిగోస్ కార్యాలయంలోని ముఖ్యమైన ఫైల్స్‌ను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే, ఏ ఒక్క ఫైల్‌నూ తరలించేందుకు ఒప్పుకొనేది లేదని మైన్స అధికారులు హెచ్చరించడంతో, ఆ ప్రయత్నం విరమించుకున్నారు.
అక్రమాలపై విచారణ ఏదీ?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ జగన్ సర్కారులో ఆయా శాఖల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చాక ఏ శాఖలోనూ అక్రమాలను కనిపెట్టేందుకు విచారణకు ఆదేశిస్తూ ఒక్క ఉత్తర్వు కూడా ఇవ్వలేదు. జగన్ అక్రమాలకు వంతపాడిన అధికారులను కాపాడేలా కొత్త ప్రభుత్వంలో కీలక పోస్టింగ్‌లు ఇచ్చారంటూ టీడీపీ కార్యకర్తలే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చాక సీఐడీ అధికారులు కీలకమైన అమరావతి రాజధాని, అవుటర్ రింగ్‌రోడ్డు కేసు ఫైళ్లను తగలబెట్టించారు. దీనిపై అప్పట్లో టీడీపీ అనేక విమర్శలు చేసింది. కానీ అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై విచారణకు ఆదేశించకపోవడంపై ఆ పార్టీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.