సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం ఏపీ సీఎం జగన్…తన తొలి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. తన కేబినెట్ లో ఎవరెవరుండాలన్న క్లారిటీతో కొంతమందిని ఎంచుకున్నారు. అయితే, పనితీరు ఆధారంగా రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని, కూడికలు, తీసివేతలు ఉంటాయని చెప్పారు. కట్ చేస్తే…ఈ రెండున్నరేళ్లలో ఏడాది కాలాన్ని కరోనా మింగేసింది. మిగతా ఏడాదిన్నరలో ఏ మంత్రి కూడా పూర్తి స్థాయిలో తన పదవిని అనుభవించలేదు.
దీంతో, మంత్రివర్గ విస్తరణ ఉండదేమో అన్న భావనలో కొంతమంది ఉండగా…వారి అపోహలను జగన్ పటాపంచలు చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో జగన్..కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చారు. రెండున్నరేళ్ల తరువాత కేబినెట్ లో మార్పులు చేర్పులు ఉంటాయని ఆనాడే చెప్పాం కదా అని జగన్ సింపుల్ గా తేల్చేశారు. మంత్రి పదవి నుంచి తప్పించిన వారు పార్టీ కోసం పని చేయాలని, వారికి జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగిస్తామని జగన్ చెప్పారు.
అయితే, కేబినెట్ విస్తరణకు వేరే సమయముందని జగన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంవమైంది. అంటే, మంత్రి వర్గ విస్తరణకు జగన్ ముహూర్తం ఫిక్స్ చేశారని, ఏదో ఒకరోజు సడెన్ గా ప్రకటిస్తారని వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. రోజా వంటి నేతలు మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ముందు వరుసలో ఉండగా….బొత్స, పెద్దిరెడ్డి, పేర్ని నాని, బుగ్గన వంటి వారు తమ పదవులు నిలబెట్టుకుంటారన్న టాక్ వస్తోంది. ఇక, అనిల్ కుమార్, నారాయణ స్వామి, వెల్లంపల్లి వంటి నేతలపై వేటుపడే అవకాశముందని తెలుస్తోంది.