రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ ఓ సూపర్ స్ప్రెడర్ కార్యక్రమం అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. సీఎం జగన్ అతి తెలివి నిర్ణయం కారణంగా పరీక్షల నిర్వహణ వల్ల 80 లక్షల మందికి ముప్పు పొంచి ఉందన్నారు. ప్రభుత్వం 15 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకే పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.
ఉద్యమం తప్పదు!
పరీక్షలు రద్దు చేయని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని లోకేశ్ అన్నారు. దేశమంతా ఒక దారిలో వెళ్తుంటే అందుకు విరుద్ధంగా జగన్ మరో దారిలో వెళ్తున్నారని, ఈ వైఖరి సరికాదని అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల రద్దు నిర్ణయాన్ని వెంటనే అఫిడవిట్ ద్వారా సుప్రీంకు తెలపాలన్నారు. ఏ విద్యార్థి ప్రాణానికి ముప్పు వాటిల్లినా సీఎం జగన్‌దే బాధ్యత అని లోకేశ్ అన్నారు. పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోకుంటే మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఫేక్ క్యాలెండర్
విద్యార్థులు, తల్లిదండ్రులు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని.. కోవిడ్ మూడో దశ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారని గుర్తు చేశారు. ఈ పరిస్థితిలో 15 లక్షలమంది పిల్లలు బయటకు వస్తే పరిస్థితి ఏంటని నారా లోకేశ్ నిలదీశారు. ఉద్యోగ క్యాలెండర్ ఓ ఫేక్ క్యాలెండర్ అని రుజువైందిని లోకేశ్ అన్నారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పింది జగన్ కాదా అని ప్రశ్నించారు.
వర్చువల్‌గా..
అదేసమయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా 30శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిందని.. అయినా జాబు రెడ్డి.. విస్మరించారని.. దుయ్యబట్టారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నారా లోకేష్ తాజాగా వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన సీఎం జగన్ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు.